తెలంగాణలో రాబోయే ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi – TRS) నుండి భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) గా పేరు మార్చుకున్న కేసీఆర్ ఆధ్వర్యంలోని BRS పార్టీ కూడా వేగంగా పావులు కదుపుతుంది.
ఇందులో భాగంగా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా BRS పార్టీ తమ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుంది. ఖమ్మం జిల్లాలో మంచి పేరున్న తానా (Telugu Association of North America) మాజీ అధ్యక్షులు జయ్ తాళ్లూరి ని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై లెక్కలు కూడా తీస్తున్నారట.
ఖమ్మం జిల్లాలో తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పటి నుంచో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న భద్రాచలం వాసి జయ్ తాళ్లూరి ని ఇప్పటి నుండే క్రియాశీలకం చేయడం ద్వారా ఖమ్మం పార్లమెంట్ తోపాటు చుట్టుపక్కల ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో కూడా మంచి ఫలితాలు రావట్టవచ్చని BRS పార్టీ లెక్కలేస్తున్నట్లుంది.
కాకపోతే ఇప్పటివరకు జయ్ తాళ్లూరి తన మనసులోని మాటను బహిరంగంగా ఎక్కడా బయటికి వ్యక్తం చేయలేదు. కానీ ఇదే విషయంపై ఖమ్మం జిల్లాలో స్థానిక పత్రికలు ఇప్పటికే అనేక కథనాలు ప్రచురించాయి. కాబట్టి రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.