తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) తానా లో గత 4 సంవత్సరాలుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు నరేన్ కొడాలి అలియాస్ ఆచార్య. ఈ నరేంద్రుడు అంతకు ముందు 2003 నుంచి 2019 వరకు తానాలో చేసిన సేవలు ఒక ఎత్తైతే, 2019 నుండి 2023 వరకు సుమారు 4 సంవత్సరాలు మరొక ఎత్తు.
2003 లో వెబ్ అండ్ ఐటీ సపోర్ట్ కోచైర్ గా ప్రారంభించిన తానా ప్రయాణం 2019 లో వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన తానా 22వ మహాసభల ఛైర్మన్ గా, అలాగే 2021 వరకు తానా బిల్డింగ్ కమిటీ కోచైర్ గా క్లైమాక్స్ కి చేరిందనుకున్న తరుణంలో తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా 2021 ఎన్నికల బరిలోకి దిగారు.
ఆ ఎలక్షన్స్ ఫలితాలు ఆశాజనంకంగా లేనప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తిరిగి 2023 ఎన్నికలలోనూ తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి అడుగు ముందుకు వేశారు. ఈ సారి ఎలెక్షన్స్ ఉంటాయో ఉండవో అంటూ కోర్టు కేసులతో ఎటూ తేలని సమయంలో కూడా రేసులో ముందున్నారు.
ఎక్కడా సంయమనం కోల్పోకుండా, విధేయత, విశ్వసనీయత మరియు ప్రభావవంతమైన సేవ అంటూ తన క్యాంపెయిన్ తను చేసుకుంటూ తన ప్యానెల్ సభ్యులను కూడా ఉత్సాహపరిచారు. ఒక టైంలో అయితే ఎలెక్షన్స్ ఉన్నా లేకున్నా, అవతల నుంచి పోటీలో ఎవరున్నా సరే ఈసారి నరేంద్రుడే తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంటూ మెజారిటీ సభ్యులు ఢంకా మోగించి మరీ చెప్పారు.
తన ప్యానెల్ లో ఉన్న మిగతా పోటీదారులు సైతం తమ పదవుల కంటే ఎక్కువగా నరేన్ కొడాలి (Naren Kodali) ని తానా అధ్యక్షులుగా చూడాలి అని పనిచేయడం అభినందనీయం. అందరూ అనుకున్నట్టుగానే ఆచార్య నరేంద్రుడికి పట్టం కట్టారు.
ఇలా మొత్తంగా చూసుకుంటే 2003 నుండి 2023 వరకు సుమారు 20 సంవత్సరాల సేవాజీవితం అనంతరం ప్రస్తుత 2023-25 కి తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా అలాగే 2025-27 గోల్డెన్ జూబిలీకి తానా అధ్యక్షులుగా సేవలందించనున్నారు నరేన్ కోడాలి.