ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వాలంటీర్ వ్యవస్థ లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలను స్థాపించి ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచుల విధులు, నిధులు, హక్కులు, అధికారాలు, బాధ్యతలను హైజాక్ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని సాగినీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ రావు అన్నారు.
రాష్ట్రంలోని సర్పంచులు ఈ వైసీపీ పాలనలో (YCP Government) ఎదుర్కొంటున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి లో “పంచాయితీ తోనే ప్రగతి” అనే నినాదంతో జరిగిన రాష్ట్ర పంచాయతీరాజ్ సదస్సుకు కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం నుండి సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు హాజరయ్యారు.
ఆళ్ళ నేతృత్వంలో రంగన్న గూడెం సర్పంచ్ కసుకుర్తి రంగా మణి, వీరవల్లి సర్పంచ్ పిల్లా అనిత, రంగన్న గూడెం ఎంపీటీసీ సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ, బాపులపాడు మాజీ ఎంపీపీ దయాల విజయనిర్మల తదితరులతో కూడిన ప్రతినిధుల బృందం పాల్గొని తమ సోదర సంఘమైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మి ముత్యాలరావుకు సంఘీభావం తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇదే విషయమై రంగన్న గూడెం నుంచి ఈరోజు ఉదయం ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ… గత తెలుగుదేశం (Telugu Desam Party) ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.96,000 కోట్ల కు పైగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ద్వారా పనులు చేపడితే తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వం అందులో 70 శాతం పనులను కూడా చేయలేకపోయిందని, తెలుగుదేశం ప్రభుత్వం (TDP Government) రాష్ట్ర బడ్జెట్ లో 13.8 శాతం నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తే ప్రస్తుత వైసిపి ప్రభుత్వం 6.9 శాతమే ఖర్చు చేసి పంచాయతీలను గాలికి వదిలేసిందని విమర్శించారు.
2019 నుంచి కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ. 9,898 కోట్లు గ్రామ పంచాయతీలకు మంజూరు చేస్తే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు దొంగిలించిందని, పంచాయతీ అసైన్డ్ రెవిన్యూ కింద రావాల్సిన రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి న వైసీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 35,000 వేల కోట్ల రూపాయలను దారి మళ్ళించిందని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించి సర్పంచుల వ్యవస్థకు గతంలో గౌరవాన్ని ఇచ్చి పంచాయతీ సర్పంచులకు విశిష్ట స్థానం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేయవలసిన ఆవశ్యకత పంచాయతీరాజ్ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పిటిసి సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్ల పై ఉన్నదని తెలియజేశారు.