విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నట రత్న, పద్మశ్రీ. డా. ఎన్టీఆర్ నట జీవిత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో తెలుగుదేశం శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ వేమన ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు ఘన నివాళి అర్పించి ఆయన సాధించిన అరుదైన ఘనతలను కొనియాడారు.
చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ… తెరపై ప్రేక్షకులకు, సమాజంలో ప్రజలకు చైతన్యం, ఆత్మగౌరవం వెన్నుతట్టి.. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని నటించి, నిరూపించిన ఒకే ఒక్కడు అన్న ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao – NTR) అని తెలిపారు.
సతీష్ వేమన మాట్లాడుతూ… తమ చిన్నతనం నుండి అన్నగారి అభిమానులమని, జీవిత చరమాంకం వరకూ ప్రజాశ్రేయస్సు కోసం శ్వాసించి, జీవించిన అరుదైన నాయకుడు నందమూరి తారక రామారావు (NTR) అని, తెలుగు జాతి ఉన్నంత వరకూ ప్రజల గుండెల్లో ఆయన చిరంజీవి అన్నారు.
భాను మాగులూరి, సాయి బొల్లినేని మాట్లాడుతూ… ప్రవాస భారతీయులమధ్య అన్నగారి నటజీవిత వజ్రోత్సవ సందర్భాన్ని గుర్తుచేసుకొని, నివాళి అర్పించి తెలుగు నేలకు, రాష్ట్ర ప్రజలకు అన్న ఎన్టీఆర్ (NTR) చేసిన రాజకీయ విప్లవాత్మక సంస్కరణాలనూ, పేద బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ద్వారా అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ప్రవాసులు జన్మభూమి అభివృద్ధికై ఎల్లప్పుడూ తమవంతు సహకారం అందిస్తున్నామని, ఇక ముందూ ఎన్టీఆర్ (NTR) స్పూర్తితో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నరేన్ కొడాలి, త్రిలోక్ కంతేటి, జనార్దన్ నిమ్మలపూడి, సత్య సూరపనేని, రాజేష్ కాసరనేని, సుధీర్ కొమ్మి, చంద్ర బెవర, సత్యనారాయణ మన్నే, రవి అడుసుమిల్లి మరియు పలువురు అభిమానులు పాల్గొన్నారు.