Connect with us

Editorial

మేకపోతు గాంభీర్యమా? ఉత్తర కుమార ప్రగాల్భాలా??

Published

on

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న నినాదం, కొత్త వాగ్దానాలతో ప్రజల ముందుకు రావడంతో జగన్ కి పట్టం కట్టారు. కానీ వాస్తవాలు ఏమిటో మూడున్నరేళ్ళలో ప్రజకు అర్ధం అయ్యాయి. గుప్పిట విప్పే వరకు ఏదైనా రహస్యంగా కనిపిస్తుంది. కానీ గుప్పెట విప్పిన తరువాత అందులో ఏమి లేదని రుజువు అయ్యింది. ఆ చందంగానే మూడున్నరేళ్ల తరువాత జగన్ డొల్లతనం ఏమిటో ప్రజలకు తెలిసి పోయింది. జగన్ తన చేతకానితనంతో, నిరంకుశత్వంతో మొండి వైఖరితో, రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు.  జగన్మోహన్ రెడ్డి చేతకాని  పాలన ద్వారా రాష్ట్రాన్ని ఎంత గబ్బు పట్టించారో ప్రతి ఒక్కరికి  కళ్ళకు కడుతున్నా 175 సీట్లు మన గెలుస్తున్నామని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులకు ధైర్యం నూరిపోస్తున్నారు. మీ పరిపాలన ఎంత అందంగా ఉందొ బస్సుల్లో ప్రయాణికులు గొడుగులు వేసుకొని కూర్చోవడం, చెరువుల తలపిస్తున్న రోడ్లపై బాతులు ఈతలు కొట్టడం ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. ఆశయాలు ఆకాశంలో వుంటే సరిపోదు చేసిన అభివృద్ధి  ఆవగింజంత అయినా ప్రజలకు కనపడాలి. నేనున్నానంటూ అధికారంలోకి వచ్చి అన్నీ విధాలుగా రాష్ట్రాన్ని, ప్రజల్ని అధోగతి పాలుచేసి కూడా 175 సీట్లు  గెలుస్తామని నాయకులను  నమ్మించడానికి నానా  తంటాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి.

ఒక  పక్కన సంక్షేమ పధకాలు అమలు చెయ్యడానికి అప్పులు చేస్తూ, ప్రభుత్వ భూములు అమ్ముతూ కూడా ప్రచారానికి అప్పులు తెచ్చిన  నిధులు మళ్లిస్తున్నారు. జనం దాహం తీర్చుకొనే ప్రతి నీటి బొట్టు పైనా, జనం ఆకలి తీర్చుకొనే ప్రతి అన్నం మెతుకుల పైనా  వై ఎస్, జగనన్న పేర్లు పెట్టి ఓట్ల పంట పండించుకోవాలని తహ,తహ లాడుతున్నారు.పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని ఊదరగొడుతున్న జగన్  ప్రజలపై విధించిన పన్నులు, మోపిన భారాలు, అధిక ధరలు, చేసిన అప్పులకు ఏం సమాధానం చెబుతారు? వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో  దాదాపు రూ 85  వేలకోట్లకు పైగా ప్రజల పై భారాలు మోపారు .గత ప్రభుత్వం అయిదేళ్లలో లక్షా 26 వేలకోట్ల అప్పులు చేస్తే వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో  రూ ఆరు లక్షల  కోట్ల అప్పులు చేసారూ. దీనికి ఏం సమాదానం చెబుతారు? లేని గొప్పలు చెప్పి సామాన్య ప్రజలను, బుద్ది జీవులను మోసం చేస్తున్నారు. రాగద్వేషాలు, భయ పక్షపాతాలు లేకుండా ప్రజలంద కి న్యాయం చేస్తానన్న హామీని అటకెక్కించి ప్రతిపక్షాలను, ప్రజలను, గిట్టని వారిని రాచి రంపాన పెడుతున్న వాస్తవాలు, ఇచ్చిన హామీలన్ని ఎలా పల్టీలు కొట్టాయో కళ్ళకు కడుతున్నా 175 సీట్లు గెలుస్తామని ప్రగల్భలాలు  పలుకుతున్నారు. కానీ మీ అరాచక,అనాగరిక,అప్రజాస్వామిక పరిపాలనకు ముగింపు పలికేందుకు  ప్రజలు  ఎన్నికల గాలివాన కోసం ఎదురు చూస్తున్నారు.                       

తన ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దపడుతున్నారన్న విషయం  అర్ధం అయింది. అందుకే పార్టీ నాయకుల్లో క్యాడర్ లో ఆత్మ విశ్వాసం నింపి వారిని కాపాడుకొనేందుకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పధకాలు విస్తృతంగా అమలు చేస్తున్నాం. మొత్తం 175 కి 175 స్థానాలు ఎందుకు గెలవలేమని శాసన సభ్యులను ప్రశ్నించారు. సంఖ్య చూసుకొని మురిసిపోవడం తప్ప మూడున్నరేళ్లుగా చేసింది ఏమిటి? అన్ని విలువలకు తిలోదకాలు పలుకుతూ ధనరాశులు పోగేసుకొనే విధ్యుక్త ధర్మాన్ని నిష్టగా పరిశ్రమిస్తున్నారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కి అరకొరగా పంచడం తప్ప చేసింది ఏమిటి? మూడున్నరేళ్లుగా జగన్ సాధించిన ఘనకార్యం ఒక్కటీ లేదు. జగన్ సాధించిన ప్రగతి ఏమిటని సగటు వ్యక్తి ప్రశ్నిస్తున్నారు, ఏమి మహాద్భుతాలు చేశారని 175 సీట్లు గెలుస్తారు? మూడున్నరేళ్లుగా అసమర్ధ, అలసత్వ, అహంకార విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ని అదః పాతాళానికి నెట్టినందుకు 175 సీట్లు గెలుస్తారా? పాలనలో విఫలం అయ్యి టక్కుటమారా విద్యలతో, దగాకోరు విన్యాసాలతో తన చేతకాని తనాన్ని ప్రతిపక్షంపై, ప్రజాసంఘాలు, మీడియా వ్యవస్థలపై నెడుతున్నందుకు 175 సీట్లు గెలుస్తారా? ప్రత్యేక హోదా తెచ్చి వందలాది పరిశ్రమలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినదుకు 175 గెలుస్తారా? పులివెందులలో జగన్ గెలుపు కూడా అసాధ్యమన్న సమాచారం వస్తుంటే 175 సీట్లు గెలుస్తామని పదే పదే గప్పాలు కొట్టడం వింతగా ఉంది. కానీ ముఖ్యమంత్రి మాటలు అతి విశ్వాసమా లేక అభద్రతా భావంలో మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు.

సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తూ అవే తనకు శ్రీరామ రక్షగా భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందని వారు, నిరుద్యోగులు, ఉద్యోగ, ఉపాద్యాయ ఇతర కార్మిక వర్గాలు పాలకపక్షాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆఖరికి సచివాలయం ఉద్యోగులు సైతం జగన్ పాలన పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు చెల్లిస్తున్న వారు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. విద్యుత్, రహదారులు, పెరిగిన ధరలు, పన్నుల పెంపు ఇసుక, సాగు, తాగు నీరు, పారిశుద్ధ్యం ఇతర రవాణా సౌకర్యాలు ఇన్ని ప్రతికూల అంశాల మద్య 175 సీట్లు పగటి కలే అవుతుంది.అంతా నేనే చేశా, అన్ని నేనే చేశా, నేను ఏదైనా చేయగలను, నాకు తెలియంది లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారు. తన వ్యక్తిగత ఇమేజ్ తో పార్టీని గెలిపించానని అపారమైన అతి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. పార్టీ శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు తన బొమ్మ పెట్టుకొని గెలిచారనే భావన ఉంది. శాసన సభ్యులు తిరిగి పోటి చేయాలంటే ఇంటి ఇంటికి తిరగాలని హుకం జారీ చేస్తున్నారు. పదే పదే 175 సీట్లు గెలవాలంటున్నారు. 2014 ఎన్నికల్లో 151 సీట్లు గెలవడానికి కారణం నేనే అన్న అహంభావమా? స్థానిక సంస్థల్లో అధర్మంగా వచ్చిన గెలుపా? ప్రజల సొమ్ము ఉదారంగా పంచుతున్నామనే ధీమానా.ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి కార్యక్రమంలో శాసన సభ్యులు ప్రజలలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రజలు ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా దాడులు చేస్తున్నారు. కొంత మంది మొక్కుబడిగా తిరుగుతుంటే, మరికొంత మంది రక్షణ వలయం మధ్యలో తిరుగుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే పరదాలు, బారికేడ్లు, అనేక రక్షణపరమైన జాగ్రత్తలు తీసుకొని పర్యటిస్తున్న పరిస్ధితి. ఎక్కువ కార్యక్రమాలని ఇంటి నుంచే నడిపిస్తున్నారు. ప్రతి రోజు తన ఇంటి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలుతో పోలీసుల పహారా కాస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కి కూత వేటు దూరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సైతం బటన్ నొక్కడు కార్యక్రమాలు చేస్తున్న దుస్థితికి దిగజారారు. అలానే మంత్రుల సభలు మరీ వెలవెలబోతున్నాయి. కొద్దో గొప్పో వచ్చిన వాళ్లు సైతం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.

ఇటీవల ఓ మంత్రి ప్రసంగిస్తున్న సభ మధ్యలోనే మహిళలు వెళ్లిపోతుంటే, నేనొస్తే మీరు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా సభికులను బెదిరించే ధోరణిలో వెళ్లిపోతున్న వాళ్ల పేర్లు రాసుకోండి, వారు ఏ వార్డు వారో తెలుసుకోండి అంటూ సచివాలయ సిబ్బందికి హుకుం జారీ చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల మధ్య తిరుగుతున్నారు. సరైన పోలీసు రక్షణ కూడా లేదు. ప్రజలని తరలించడం అసలే లేదు. అయిన ఆ సభలు విజయవంతం అవుతున్నాయి. కాని ముఖ్యమంత్రి సభలకు ప్రజలని తరలించాలి. వచ్చిన వారు వెళ్లిపోకుండా కాపలా కాయాలి. స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి. ఆర్టీసీ, స్కూళ్లు, కాలేజీల బస్సులను బలవంతంగా లాక్కోవాలి. అంగన్ వాడీ టీచర్ల నుండి విద్యార్ధుల వరకు సభకు రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన అంటేనే అధికారులు, ప్రజాప్రతినిధులు భయపడిపోతున్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి కాళ్లు భయటపెడుతుంటే ఏ ప్రాంతానికి వస్తున్నారో అని ప్రాంత ప్రజలు, సొంత పార్టీ నాయకులే భయబ్రాంతులకు గురి అవుతున్నారు. గతంలో ముఖ్యమంత్రులను మా ప్రాంతాలకు రమ్మంటే మా ప్రాంతాలకు రమ్మని ఆహ్వానించే వారు కాని నేడు ఆ పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రి భయటకు వస్తుంటే అన్నింటిని దిగ్బందనం చేస్తున్నారు. ప్రజలను ఎక్కడిక్కడ నిలిపివేస్తున్నారు. వ్యవస్థలు నడవకుండా ఆపేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇంటికి పరిమితం అయితే మేలని సామాన్యులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితులలో 175 సీట్లు ఎలా సాధ్యమో అర్ధం కావడం లేదు.

ముఖ్యమంత్రి పరిస్థితి అలా ఉంటే, మేమెలా ప్రజల్లోకి వెళ్ల గలమని శాసనసభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు అడుగుతున్న చిన్న, చిన్న పనులని సైతం చేయలేని పరిస్ధితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎన్నికల వాగ్దానాలలో 98.4 శాతం పూర్తి అయినట్లు ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. నిజంగా 98.4 శాతం పనులు పూర్తి అయ్యి ఉంటే, ఎన్నికల వాగ్దానాలు అమలు జరిగి ఉంటే ప్రజలలో తిరిగాల్సిన పని లేదు. ప్రజలే స్వచ్ఛందంగా ఎన్నికలలో గెలిపిస్తారు. కాని అటువంటి పరిస్ధితి కనిపించడం లేదు. అంటే ఒక అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు అది నిజమని నమ్ముతారనే గోబెల్స్ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. కనీసం 10 శాతం హామీలను నెరవేర్చకుండా అంతా చేసేసామని డప్పులు కొట్టుకుంటే ఎలా? ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. పాదయాత్రలో ఒక హామీనిచ్చి, మ్యానిఫెస్టోలో మరొక హామీపెట్టి, అధికారంలో ఇంకోటి చేస్తున్నారు. ఉదాహరణకు అమ్మ ఒడి పథకం తీసుకుంటే రాష్ట్రంలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు ఇస్తానని పాదయాత్రలో హామీనిచ్చారు. ఆ తరువాత పిల్లల తల్లులకు రూ.15వేలు ఇస్తానని మ్యానిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు రూ. 13 వేలు అమలు చేస్తున్నారు. ఇది మోసం కాక మరేమిటి? ముఖ్యమంత్రి స్ధాయిని దిగజారుస్తూ నానెత్తి మీద బొచ్చు కూడ పీకలేరని చేసిన వ్యాఖ్యలు తనలోని అభద్రత భావాన్ని భయట పెడుతున్నాయి. మంత్రులుగా కొనసాగాలంటే ప్రతిపక్షాలపై ఎదురు దాడి, చౌకబారు విమర్శలు చేయాలి, బూతులు తిట్టాలి అని పరోక్షంగా మంత్రి వర్గ సహచరులకు సాక్షాత్తు ముఖ్యమంత్రే సంకేతాలు ఇస్తున్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే భావోద్వేగాలు, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే రీతిలో ఉత్తారాంధ్ర ప్రజలు ఊరుకోరని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడటం బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట. శాంతి, భద్రతలని రక్షించాల్సిన ముఖ్యమంత్రే ఇలా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రలో అలజడులు సృష్టించేందుకు మూడు రాజధానుల పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానం పాదయాత్రకు అనుమతించినా అధికారపక్షం దారులను మూసివేసి అడ్డంకులు సృష్టించడం ఏమిటి? కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన జగన్ రెడ్డి తాము గెలిపించిన ప్రజలపై పోరాటం చేస్తున్నారు. గర్జనల ముసుగులో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.

నన్ను చూసే ఓట్లు వేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ముఖ్యమంత్రి గ్రాఫ్ బాగున్నట్లు, ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేనట్లా?. జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలని మార్చాల్సిన అవసరం ఏముంది? మారాల్సింది ముఖ్యమంత్రా, ఎమ్మెల్యేలా? సహజంగా ప్రత్యర్థుల మానసిక స్థైర్యం దెబ్బ తీయడానికి 175 సీట్లు గెలవాలనే నినాదమా? లేక తమ సొంత పార్టీ శాసన సభ్యులలో ఆత్మస్ధైర్యాన్ని పెంచడానికా?. కాని మొదటి పార్టీ సమావేశంలో 68 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించడం కష్టమన్నారు. మొన్న 27 మంది పరిస్ధితి బాలేదన్నారు. మొదట చెప్పిన 68 మంది తరువాత చెప్పిన 27 మంది దాదాపు షుమారు 95 మంది గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అర్ధం అవుతుంది. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా సుమారు 80 శాతం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. లక్షన్నర కోట్లు పంచిపెట్టిన తరువాత కూడా ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుంది? సంక్షేమ పథకాలను పూర్తిగా వాలెంటీర్ల ద్వారా అందిస్తున్నారు. బటన్ నొక్కుతుంది ముఖ్యమంత్రి, పంచుతున్నది వాలెంటీర్లు, ఇంక ఎమ్మెల్యేలతో పని ఏంటని కొంత మంది శాసనసభ్యులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారసులు కాదు, మీరే పోటీ చేయాలని తేల్చి చెప్పాడు. దీనిని బట్టి కొత్తవారిని రంగంలోకి దింపి జగన్ ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా లేరు. గెలుపుపై విశ్వాసం ఉంటే ఎవరినైనా ఎన్నికల బరిలో దించి గెలిపిస్తాననే ప్రగల్బాలు పలికే వారు. ఎత్తుకు పై ఎత్తు, వ్యూహాలు రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ ముఖ్యమంత్రి మాటలు అతి విశ్వాసమా లేక అభద్రతా భావంతో మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. కాని ఆయన వ్యాఖ్యలు పిట్టల దొరలను తలపిస్తున్నాయి.

– మన్నవ సుబ్బారావు, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected