కేంద్ర గజెట్ తో రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణ జలాల పునఃపంపిణీ చేయాలని నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రైతులకు తీరని అన్యాయం అని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు విజయవాడ (Vijayawada) లో సి.పి.ఐ (Communist Party of India) నిర్వహించిన నిరసన దీక్షలో అన్నారు.
విజయవాడ ధర్నా చౌక్ లో భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కృష్ణా జలాల పునఃపంపిణీ, కేంద్ర ప్రభుత్వం గజేట్ నోటిఫికేషన్ లపై 30 గంటల నిరసన దీక్షలో సాగునీటి సంఘాల రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొన్న ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు (Alla Venkata Gopala Krishna Rao) మాట్లాడుతూ… 2020 అక్టోబర్ లో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరగా.. దీనిమీద జగన్మోహన్ రెడ్డి కనీసం అభ్యంతరం చెప్పకపోవడంతో పాటు పల్లేత్తు మాటైనా అనకపోవడంతో నేడు కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల పునఃపంపిణీ కి తెలంగాణకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వటానికి ప్రధాన కారణం అయిందని, ఇటువంటి అసమర్ధ చర్యలతో జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రైతు ద్రోహిగా మారారన్నారు.
బ్రిజేష్ కుమార్ తీర్పు అమలుపై మన రాష్ట్రం సుప్రీంకోర్టులో వేసిన ఎస్.ఎల్.పి పెండింగ్ లో ఉండగా రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలలో 2015 జూన్ లో కె.ఆర్.ఎం.బి దగ్గర ఇరు రాష్ట్రాల అధికారులు ఒప్పందాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ కు 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకునే లా అంగీకారం తెలిపారన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజెట్ వలన శ్రీశైలం ఎగుబాగాన తెలంగాణ ప్రభుత్వం సిడబ్ల్యూసి, అపెక్స్ కౌన్సిల్,కే.ఆర్.ఎం.బి నుండి ఏ విధమైన అనుమతులు తీసుకోకుండా 105 టీఎంసీలతో పాత ప్రాజెక్టులు విస్తరణ, 150 టిఎంసి లతో పాలమూరు-రంగారెడ్డి, దిండి తదితర కొత్త ప్రాజెక్టులతో కలిపి మొత్తం 255 టీఎంసీలతో నిర్మాణాలు పూర్తి చేసుకుంటే శ్రీశైలం దిగు భాగాన అన్ని రకాల నికర కేటాయింపులు ఉన్న నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల కింద ఉన్న 15 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టా కింద ఉన్న 13 లక్షల ఎకరాలు, ఎస్.ఆర్.బీ.సి క్రింద ఉన్న 2 లక్షల ఎకరాలు మొత్తం 30 లక్షల ఎకరాలకు చుక్క నీరు అందకుండా శాశ్వతంగా బీడుగా మారిపోయే అవకాశం ఉందని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ.. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థ వైఖరే అన్నారు.
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, కర్నూలు నుంచి కృష్ణా వరకు ఉన్న తొమ్మిది ఉమ్మడి జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంత రైతుల్లో చైతన్యం తెచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శులు కుర్రా నరేంద్ర, బొంతు శివ సాంబి రెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమా వరప్రసాద్, కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ, గుంటూరు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.