ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ చరిత్రలో మరో కలికితురాయి. అదే మొట్టమొదటిసారి ఇండియాలో వికలాంగుల క్రికెట్ పోటీల నిర్వహణ. తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ నేతృత్వంలో జనవరి 5, 6 తేదీల్లో ‘డిఫరెంట్లీ ఏబుల్డ్ వీల్ ఛైర్ క్రికెట్ కప్’ పేరుతో విశాఖపట్నంలో నిర్వహించిన వికలాంగుల క్రికెట్ పోటీలలో క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది.
దేవుడు మా బాడీలో అంగవైకల్యం పెట్టాడేమో కానీ మా మనసుల్లో, మా పట్టు విడవని దృక్పథంలో మాత్రం కాదు అన్నట్టు పోటాపోటీగా జరిగిన ఈ క్రికెట్ మ్యాచ్ నిరూపించింది. రెగ్యులర్ క్రికెట్ మ్యాచ్ కి ఏమాత్రం తీసిపోకుండా మంచి పాషన్తో ఆడి నూటికి వంద శాతం క్రీడాస్ఫూర్తిని చాటారు ఆటగాళ్లు. వీల్ ఛైర్స్ లోనుంచే బాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చెయ్యడం చూసిన ప్రేక్షకులకు మాత్రం ఒక మంచి అనుభూతి కలిగింది.
మొదటి రోజు జనవరి 5న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జట్లు మరియు క్రికెట్ సంఘాల సభ్యులతో పరిచయకార్యక్రమం నిర్వహించారు. తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ప్రతి ఆటగాడి దగ్గిరకి వెళ్ళి ఆప్యాయంగా పలకరించడం విశేషం. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన శశాంక్ ను అందరూ అభినందించారు. భోజన విరామం అనంతరం ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించారు.
రెండవ రోజు జనవరి 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జట్ల మధ్య అసలు మ్యాచ్ నిర్వహించారు. టాస్ గెలిచిన ఆంధ్ర జట్టు ముందు బాటింగ్ చేసి 15 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది. తర్వాత తెలంగాణ జట్టు 6 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. దీంతో ఆంధ్ర జట్టుని విజయం వరించింది.
మ్యాచ్ ఆడిన తీరు చూస్తే రెండు జట్లు విజేతలనే చెప్పాలి. అనంతరం ముగింపు వేడుకలలో భాగంగా అతిధుల ప్రసంగాలతోపాటు క్రికెట్ అభిమానుల మధ్య విన్నింగ్ ట్రోఫీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలు అందించారు.
ఈ సందర్భంగా శశాంక్ మాట్లాడుతూ మన తోటి అన్నతమ్ముల కోసం మొట్టమొదటి సారిగా క్రికెట్ కప్ నిర్వహించడం నిర్వహించడం అంతులేని ఆనందాన్నిచ్చిందని, ఇది ప్రారంభం మాత్రమే అని ముందు ముందు ఇంకా పెద్ద లెవెల్లో ఎక్కువ జట్లతో నిర్వహించడానికి ప్రణాళిక చేస్తామన్నారు. ఆటగాళ్ల కళ్ళల్లో చూసిన ఆనందం, విశ్వాసం మాటల్లో చెప్పలేనిదని అన్నారు.
ఈ క్రీడా కార్యక్రమంలో వివిధ హోదాల్లో సహాయం చేసిన తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, కార్యదర్శి సతీష్ వేమూరి, ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని, దాతలు రాజా కసుకుర్తి, రాజేష్ యార్లగడ్డ, జయచంద్ర రామినేని, జేపి వేజెండ్ల తదితరులకు శశాంక్కృతఙ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులు అలాగే తెలుగు మీడియాతోపాటు హిందూ పత్రిక లాంటి జాతీయ మీడియా కూడా ఈ పోటీల కోసం వచ్చారంటే సామాన్య విషయం కాదు. తానా చరిత్రలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా శ్రద్ధతో విజయతీరాలకు చేర్చి విజయవంతమవడం శశాంక్ గొప్పతనమే.
అతి తక్కువ సమయంలో ఈ పోటీలకు వివిధ పర్మిషన్స్, గ్రౌండ్ ప్రిపరేషన్, ఆటగాళ్లకు ఏర్పాట్లు తదితర విషయాల్లో స్పీడ్ గా వ్యవహరించి సహకరించిన విశాఖపట్నం డెప్యూటీ మేయర్ శ్రీధర్ జియ్యాని, రమణ సురవరపు తదితరులు అభినందనీయులు.