డాలస్, టెక్సాస్: అమెరికా లోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారక స్థలి (Dallas, Texas) వద్ద 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం నాడు వైభవంగా జరిగాయి. గౌరవ కాన్సుల్ జెనరల్ ఆఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ భారత ప్రధాని నరేంద్రమోడి 10 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితి (United Nations) లో ఇచ్చిన పిలుపుననుసరించి నేడు విశ్వవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగాదినోత్సవంగా పాటించడం ముదావహం అన్నారు. అనునిత్యం యోగాభ్యాసం చెయ్యడంవల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (Mahatma Gandhi Memorial of North Texas) వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ కు స్వాగతం పలుకుతూ గత పది సంవత్సరాలగా ఈ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం హజరవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నదని, ఇది కేవలం ఒకరోజు వేడుక కాకూడదని, అన్ని కార్పోరేట్ మరియు విద్యాసంస్థలలో ప్రతిరోజు యోగాభ్యాసం చేసే విధాన నిర్ణయాలు తీసుకుని, దానికి తగిన ఏర్పాట్లుకల్పిస్తే అందరూ శారీరక, మానసిక ఆరోగ్యాలలో సత్ఫలితాలు సాధించవచ్చునని అన్నారు.
డా. ప్రసాద్ తోటకూర మహత్మాగాంధీ (Mohandas Karamchand Gandhi) మెమోరియల్ బోర్డ్ సభ్యులందరితో కలసి గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా (Consul General of India), డి. సి. మంజునాథ్ కు మహాత్మాగాంధీ చిత్రపటాన్ని బహుకరించి, ఘనంగా సన్మానించారు. ముందుగా మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల సభను ప్రారంభించి ముఖ్యఅతిథికి, బోర్డుసభ్యులకు, పాల్గొన్న వారందరికీ స్వాగతం పలికారు.
ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (India Association of North Texas) అధ్యక్షురాలు, మరియు మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యురాలు అయిన సుష్మ మల్హోత్రా క్రమక్రమంగా యోగావేడుకలలో పాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఈ సంవత్సరం డి.ఎఫ్.డబ్ల్యు హిందూ టెంపుల్, యోగభారతి, హార్ట్ఫుల్నెస్, ఈషా, ది యూత్ ఎక్ష్సలెన్స్ లాంటి సంస్థలు వారి సభ్యులతో పాల్గొనడం చాలా సంతోషం అన్నారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (Mahatma Gandhi Memorial of North Texas)వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు రావు కల్వాల, జాన్ హామండ్, రన్నా జానీ, మురళి వెన్నం, సుష్మా మల్హోత్రా, కమల్ కౌశల్, రాజీవ్ కామత్, బి. యెన్. రావు మరియు ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యవర్గ సభ్యులు – మహేందర్ రావు, దినేష్ హూడా, ఉర్మీత్ జునేజా, దీపక్ కాల్ రా, ఆమన్ సింగ్, అమిత్ బూచె, సమర్నిక రౌత్ మొదలైన వారు తగు ఏర్పాట్లుచేసి యోగావేడుకలు విజయవంతంగావడంలో కీలకపాత్ర వహించారు.
మహాత్మాగాంధీ స్మారక స్థలి (Dallas, Texas) వద్దవిశాల మైదానంలో రెండు గంటలకు పైగా సాగిన ఈ యోగా (Yoga) వేడుకలలో అన్ని వయస్సులవారు ఉత్సాహంగా పాల్గొని, యోగాభ్యాసం అనంతరం ‘పీకాక్ ఇండియా రెస్టారెంట్’ వారు ఏర్పాటు చేసిన ఫలాహారాలను ఆస్వాదించి ఆనందించారు.