కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సహాయంతో ఏర్పాటు చేసిన నూతన జల శుద్ధి (వాటర్ ప్యూరిఫయర్) యంత్రాన్ని ఓర్వకల్ పొదుపు మహిళా సంఘం గౌరవ సలహాదారు విజయ భారతి, ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ మే 6 న ప్రారంభించారు.
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యార్థులు దాహార్తితో పాటు పలు ఇబ్బందులు పడుతున్న విషయం కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ చైర్మన్, ఎన్నారై పొట్లూరి రవి దృష్టికి తేవడం జరిగిందని వెంటనే స్పందించి జల శుద్ధి యంత్రంతో పాటు పాఠశాలలో చదువుతున్న నాలుగు వందల మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్, అన్ని తరగతి గదులకు నూతన ఫ్యాన్లు కూడా అందించారని తెలిపారు.
లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేస్తున్నబాలభారతి పాఠశాలకు ప్రతి సంవత్సరం లాగానే 2022 లో కూడా సహాయం అందిస్తామని, బాలభారతి పాఠశాల విద్యార్థులను ఎన్నారై విద్యార్థులతో ఆన్ లైన్ లో అనుసంధానం చేసి ఆధునిక సాంకేతిక విద్యను బోధించడానికి కృషి చేస్తామని కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి తెలిపారు.
పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని బాలభారతి పాఠశాల ప్రధానోపాద్యాయుడు క్లెమెంట్ సత్యంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సందడి మధు, ఉపసర్పంచ్ నాగేశ్వరి, పొదుపు మహిళా సంఘం చైర్మన్ విజయ లక్ష్మి, కార్యదర్శి తాజునిష, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సత్య, పొదుపులక్ష్మీ ఐక్య సంఘంకు చెందిన పలువురు మహిళలు, బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.