ఫౌండర్ డా. పైళ్ల మల్లారెడ్డి అశీసులతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అమెరికా అంతటా ఘనంగా నిర్వహిస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA). ఇందులో భాగంగా అడ్వైసరీ చైర్ డా విజయపాల్ రెడ్డి, అడ్వైసరీ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, మెంబర్ భరత్ రెడ్డి మాదాడి లు మొట్టమొదటిసారిగా తెలంగాణ కి ప్రీతీ పాత్రమైన బోనాలు మరియు అలయ్ బలయ్ జాతరను జరపాలని నిర్ణయించారు.
ప్రెసిడెంట్ వంశీ రెడ్డి అధ్యక్షతన జరిగిన టిటిఎ బోనాలు మరియు అలయ్ బలయ్ కు వివిధ నగరాలలో జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. అమెరికా అంతటా ఘనంగా మహంకాళి బోనాల జాతరను అట్టహాసంగా నిర్వహించారు. టిటిఎ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా. నరసింహ రెడ్డి దొంతిరెడ్డి పర్యవేక్షణలో, టిటిఎ కల్చరల్ చైర్ ప్రియాంక కృష్ణ వివిధ నగరాలకు కావాల్సిన ఏర్పాట్లను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు.
సియాటెల్: అధ్యక్షులు వంశీ రెడ్డి స్వస్థలమైన సియాటెల్ లో వేయిమంది ఆహుతులతో మహంకాళి అమ్మవారి జాతర సియాటెల్ నగరం లోని రెడ్ మాండ్ లో మేరీమూర్ పార్కులో అట్టహాసంగా నిర్వహించారు. అమ్మవారు ముస్తాబై కదలిరాగా, తెలంగాణ తీన్మార్ జోరుదార్ దప్పులతో, పోతరాజుల నడుమ మహంకాళి అమ్మవారికి సియాటెల్ నగర ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. వచ్చిన వారికి టిటిఎ సభ్యులు చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు.
గ్రేటర్ ఫిలడెల్ఫియా: టిటిఎ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా’ నరసింహరెడ్డి దొంతిరెడ్డి స్వంత నగరమైన గ్రేటర్ ఫిలడెల్ఫియాలో బోనాల జాతర సంబురాలు అంబరాన్ని అంటాయి. డెలావేర్ లోని మిడిల్ టౌన్ నగరంలో ఆల్ఫ్రెడ్ వాటర్స్ మిడిల్ స్కూల్ నందు శనివారం నిర్వహించిన సంబురాలు వేయి మంది ఆహుతులతో కిక్కిరిసింది. మహిళలంతా బోనాలతో వెంటరాగా అమ్మవారు పలారం బండిలో పోతరాజు తోడుగా వేదికపై తరలి వచ్చారు. మహిళలంతా అమ్మవారికి బోనం సమర్పించి వడి బియ్యంనింపి అలయ్ బలయ్ చేసుకున్నారు. వచ్చిన వారికి టిటిఎ వాలంటీర్లంతా చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు.
ఆస్టిన్: మొట్ట మొదటిసారిగా ఆస్టిన్ నగరం లో టిటిఎ తన కార్యకలాపాలను బోనాల జాతర తో మొదలు పెట్టింది. అంగరంగ వైభవంగా మహంకాళి అమ్మవారి జాతర ఆస్టిన్ టిటిఎ వాలంటీర్లు ఘనంగా ఏర్పాటు చేశారు. పోతరాజు పూనకం తో హుషారైన బోనాల పాటలతో ఆస్టిన్ నగరంలోని ఆసియన్ అమెరికన్ రెసోస్ సెంటర్ ఉర్రోతలూగింది. మహిళలు బొనమెతుకుని అమ్మవారి వెంట రాగ, అమ్మవారు కొలువుతీరి టిటిఎ ఆస్టిన్ బోనాలు అందుకున్నారు. ఆహూతులకు టిటిఎ ఆస్టిన్ టీం చక్కని విందు భోజనం తో పాటు మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
అట్లాంటా: టిటిఎ అడ్వైసరి కౌన్సిల్ మెంబెర్ భరత్ రెడ్డి మాదాడి పర్యవేక్షణలో అట్లాంటాలోని కమ్మింగ్ నందు గల శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ లో మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. అట్లాంటా మహిళలంతా బొనమెత్తగా ఆహ్లాదకరమైన వాతావరంల్లో షుమారు వెయ్యి మంది భక్తులు వెంటరాగా అమ్మవారు పోతరాజు తో కలిసి ఊరేగింపుగా వచ్చారు. భక్తులు బోనం సమర్పించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. సంబరాలలో పాల్గొన ప్రతి ఒక్కరికి అట్లాంటా టిటిఎ కార్యవర్గ సభ్యలు ఘనంగా ఏర్పాటు చేశారు.
హూస్టన్: టెక్సాస్ లోని హూస్టన్ నగరం లో హూస్టన్ బోర్డు అఫ్ డైరక్టర్ దుర్గ ప్రసాద్ పర్యవేక్షణలో మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. టిటిఎ హూస్టన్ మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ గ్రేటర్ హూస్టన్ కలిసి నిర్వహించిన బోనాల జాతర షుగర్ లాండ్ లోని అష్టలక్ష్మి టెంపుల్ లో ఘనం గా నిర్వహించారు. కిక్కిరిసిన భక్తులతో హూస్టన్ నగరం సంబురాలను ఘనం గా జరుపుకుంది. బోనాలతో మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కారు.
అమెరికా అంతటా ఈ శనివారం టిటిఎ నిర్వహించిన బోనాల జాతర అట్టహాసంగా ముగిసింది. ఈ కార్యక్రమాలలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రెసిడెంట్ వంశీ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.