ది డెవిల్స్ ఛైర్ అంటూ మరో హర్రర్ మూవీతో టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులముందుకు వస్తున్నారు అమెరికాలోని అట్లాంటా (Atlanta, Georgia) వాసి వెంకట్ దుగ్గిరెడ్డి. ఇప్పటికే విలన్, డిటెక్టివ్, డాక్టర్, కిల్లర్ వంటి పలు విలక్షణమైన పాత్రలలో వెంకట్ (Venkat Duggireddy) నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.
ఈసారి దాదాపు 40 నిమిషాల నిడివితో కూడిన ప్రొఫెసర్, మెంటలిస్ట్ పాత్రలో ది డెవిల్స్ ఛైర్ (The Devil’s Chair) సినిమాతో వెంకట్ మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కథ అంతా కూడా ఒక పురాతన కుర్చీ చుట్టూ తిరుగుతుందని, ఆ కుర్చీని వెంబడిస్తూ విలన్ పెడుతున్న ఇబ్బందులను సాల్వ్ చేస్తూ ముందుకు సాగే రోల్ లో వెంకట్ నటిస్తున్నట్లు తెలిసింది.
ఆ విలన్ పెడుతున్న ఇబ్బందులేంటి, ఆ ప్రాసెస్ లో హీరో హీరోయిన్ ఎలా ఇబ్బందులు పడ్డారు, మనోజేవా పాత్రలో వెంకట్ ఆ ఇబ్బందులను ఎలా సాల్వ్ చేశారు, మూవీ (Movie) క్లైమాక్స్ ఎలా ముగిసింది వంటి విషయాలు తెలియాలంటే వచ్చే ఫిబ్రవరి 22న విడుదలవనున్న ది డెవిల్స్ ఛైర్ (The Devil’s Chair) సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాతో మరో అట్లాంటా వాసి చంద్ర సుబ్బగారి (Chandrasekhar Reddy Subbagari) మొదటిసారి టాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నారు. మెయిన్ విలన్ పాత్రలో చంద్ర నటిస్తున్నట్లు, రక్తం చూడగానే తన ఆత్మ వివిధ మనుషుల్లోకి వెళ్లడం, వారిని ఇబ్బంది పెట్టడం వంటి పాత్రలో లీనమైనట్లు తెలిసింది. మేకర్స్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో (Making Video) చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
హర్రర్ సీన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసేలా మంచి గ్రిప్పింగ్ కథనంతో దర్శకులు గంగాధర్ సప్తశిఖర (Gangadhar Sapthasikhara) సినిమాని తీర్చిదిద్దినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇంకా ఈ సినిమాలో అదిరే అభి (Adire Abhi), ఛత్రపతి శేఖర్, జబర్దస్త్ నవీన్ (Jabardasth Naveen), స్వాతి మందల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాలో ఏఐ (Artificial Intelligence) టెక్నాలజీ కూడా వాడినట్లు వీనికిడి. బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సిఆర్ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కెకె చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర సుబ్బగారి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఫిబ్రవరి 22న 7:30 షో తో మొదలై ఒక వారంపాటు అట్లాంటా (Atlanta, Roswell) లోని రోస్వెల్ అరోరా సినీ ప్లెక్స్ లో ప్రతి రోజూ ఒక షో వేయనున్నారు.