ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA మరియు 100 దేశాల లోని తెలుగు సంఘాల (Telugu Associations) ఆధ్వర్యంలో శత శతక కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ Africa to America అంటూ ‘వందే విశ్వమాతరమ్‘ పేరుతో 100 దేశాలలో శాంతి సద్భావనా యాత్ర కు శ్రీకారం చుట్టారు.
ఈ యాత్ర లో భాగంగా డిసెంబర్ 18న అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన గావించారు. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులతో ఈ అరుదైన కార్యక్రమం విజయవంతమైంది. అమ్మ నాన్న గురువుల గురించి విద్యార్థులు ఆనందంగా, ఆత్మీయంగా, అభిమానంగా పద్యాలు పాడుతూ పరవశించిపోయారు.
సాహిత్య చరిత్రలో అపూర్వ ఘట్టంగా నిలిచిన ఈ పద్యగాన కార్యక్రమం తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు (Niranjan Srungavarapu) మరియు తానా పూర్వ అధ్యక్షులు & వందే విశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి (Jayasekhar Talluri) నేతృత్వంలో నిర్వహించామని చిగురుమళ్ళ శ్రీనివాస్ Chigurumalla Srinivas) తెలిపారు.
ఉద్వేగంగా, ఉత్సాహంగా ఊరూరా విశ్వ వ్యాప్తంగా పిల్లలు ఆలపించిన పద్యగాన మాధుర్యంలో తల్లిదండ్రులు, గురువులు తడిసి ముద్దయ్యారు. పెద్దల పట్ల గౌరవ భావం పెంపొందించేలా విద్యార్థులను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించామని పలు పాఠశాలల ఉపాధ్యాయులు (School Teachers) అన్నారు.
పంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల (Telugu Associations) సహకారంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థులు, అమెరికాలోని తానా పాఠశాల విద్యార్థులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ కార్పోరేట్ పాఠశాలల విద్యార్థులు, ఇతర ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు, విశ్వ విద్యాలయాల విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.
అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన కార్యక్రమాన్ని చూసినవారు 10 లక్షల మంది పిల్లలు, గురువులు అవని సీమపై అక్షర తాండవం చేసినట్లుందని కొనియాడారు. అమ్మ మీద అనురాగం, నాన్న మీద గౌరవం, గురువు మీద భక్తి ప్రకటించేలా గొంతులెత్తి లక్షలాది మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం.