శ్రీ మీనాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆశీస్సులతో ఉగాది వేడుకలను హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (Houston Telugu Cultural Association) ఏప్రిల్ 23 వ తేదీన అద్భుతంగా జరిపింది.
చక్కటి ప్రణాళికతో దిగ్విజయంగా నిర్వహించే సదవకాశం మాకు దక్కినందుకు టిసిఏ (TCA) కార్యనిర్వాహణ సమితి తరఫున ధన్యవాదములు తెలుపుచున్నాము. 800 మందికి మించిన ప్రేక్షకులతో కిటకిటలాడిన సభాప్రాంగణం, మొత్తం హ్యూస్టన్ మహా నగరమే తరలివచ్చిందా అన్న చందంగా కన్నుల పండుగగా కనబడింది.
తెలుగు సాంస్కృతిక సమితి కార్యనిర్వాహక సమితిలోని సభ్యులు:- అధ్యక్షురాలు: ఆశాజ్యోతి దేవకి గారు జనరల్ సెక్రటరీ: మైథిలి చాగంటి గారు ట్రెజరర్: రవి గునిశెట్టి గారు, కల్చరల్ సెక్రటరీ: స్నేహ రెడ్డి చిర్ర గారు వెబ్ అండ్ కమ్యూనికేషన్స్: రత్నాకర్ మోడేకృత్తి గారు లిటరరీ కోఆర్డినేటర్: రామకృష్ణ గొడవర్తి గారు స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇంఛార్జ్: శ్రీనివాస్ నూతలపాటి గారు ధర్మకర్తలు: శ్రీధర్ దాడి గారు, ఇందిర చెరువు గారు, శ్రవణ్ ఎర్ర గారు
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఘనాపాఠీల వేద మంత్రముల నడుమ, రెప్రజంటేటివ్ ఎడ్ థాంమ్సన్ గారితో పాటుగా 2023-24 సంవత్సరముల కార్య నిర్వాహక వర్గము మరియు ధర్మకర్తలు వేదికనలంకరించారు.కార్యక్రమ ఆరంభ సూచికగ అమెరికా మరియు భారత జాతీయ గీతాలాపన జరిగింది.
తదనంతరం కర్ణాటక సంగీతము, శాస్త్రీయ సంగీతము, నాట్యము, సినిమా పాటలు, డ్యాన్సులు, తెలుగు నాటికలు మరియు ఫ్యాషన్ షోలు జరిగినవి. ప్రదర్శకుల అవిశ్రాంత సాధన వలన, వారి వారి గురువుల, శిక్షకుల, కుటుంబ సభ్యుల బంధువుల కేరింతలు, ప్రోత్సాహాల నడుమ వారి ప్రదర్శనలన్నీ అద్భుతంగా ఆవిష్కృతమయినాయి.
తెలుగు జాతికి చెందిన కొందరు మహానుభావులను ఆహ్వానించి వారిని ఉగాది పురస్కారాలతో సత్కరించుకోవడాన్ని మేము చాలాగర్వంగా భావిస్తున్నాము.మన పియర్ ల్యాండ్ కు ఎన్నికైన మేయర్ కోల్, మరియు జడ్జ్ పాటిల్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి శ్రీమతి మణిశాస్త్రి, శ్రీ సుధేష్ పిల్లుట్ల, శ్రీమతి స్రవంతి మొదలి, శ్రీమతి స్వరాజ్ శివరామ్ మరియు శ్రీ శ్రీధర్ కంచకుంట్ల గార్లను ఆయా రంగాలలో వారుచేసిన , చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఘనంగ సత్కరించడం జరిగింది.
ఆ మహానుభావులను ఆదర్శంగా తీసుకుని మనం నేర్చుకోవలసినది చాలా ఉంది.ఉగాది పర్వదిన ప్రత్యేకతలను విశిష్టతలను వివరిస్తూ వారు చేసిన ప్రసంగాలు విజ్ఞాన దాయకమే గాక మనలో స్ఫూర్తిని రగిలించేవిగా ఉన్నాయి.ఈ ఉగాది వేడుకలను నిర్వహించడంలో సహ ఆతిథ్య బాధ్యతను తీసుకున్న శ్రీ మీనాక్షీ అమ్మవారి గుడి యాజమాన్యపు సహకారాన్ని వెలగట్టలేము.
ఈ ఆలయపు కమటీ ఛెయిర్మన్ శ్రీ వినోద్ రెడ్డి కైలా గారు తెలుగు సాంస్కృతిక సమితి (Houston Telugu Cultural Association) మరియు అమ్మవారి గుడి యాజమాన్యము 1977 వ సంవత్సరం నుండి కూడ ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందుకు సాగడాన్ని ప్రశంసించారు.
ఈ పర్యాయం తెలుగు సాంస్కృతిక సమితి అనుబంధ సంస్థ అయిన ‘తెలుగు బడి’ (Telugu Badi) విద్యార్ధులు వారి ప్రదర్శనల ద్వారా వారి నైపుణ్యాలను ప్రదర్శించడమేగాక, భావితరాలకుఅంకితభావంతో తెలుగు భాషను అందిస్తున్న గురువులను తెలుగు సాంస్కృతిక సమితి కార్యనిర్వాహక వర్గం సత్కరించడం నిజంగా అభినందనీయం.
ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించిన వారికి,వేదికను అలంకరించిన వారికి, ఛాయా గ్రాహకులకు, అందరికి ఆహారాన్ని అందించిన వారి అనన్యమైన సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి ఎంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఉంటారో లెక్క కట్టలేము.
తెలుగు సాంస్కృతిక సమితి యొక్క స్వర మాధురి విద్యార్ధులు, తెలుగు సినిమా దిగ్గజ దర్శకులు, శ్రీ కె. విశ్వనాధ్ గారికి నివాళులర్పిస్తూ చేసినప్రదర్శన నభూతో నభవిష్యతి. హ్యూస్టన్ మహా నగరానికి చెందిన స్వఛ్చంద సంస్థలు అందించిన సహకారాన్ని మరువలేము.
ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగ జరిగిందంటే-టికెట్లు అమ్మడంలోను, జనసందోహాన్ని అదుపు చేయడంలోను,అందరికి ఆహారమందేలాగా చూడడంలోనూ ఈ నగరం నలుమూలల నుండి వచ్చిన స్వఛ్చంద సేవకుల అవిశ్రాంత శ్రమ ఆద్యంతమూ కనబడింది. వారికి ప్రత్యేక ధన్యవాదములు.
బావర్చి బిర్యాని వారందించిన విందు భోజనమారగించాక స్థానికులైన శ్రీ హర్ష మరియు ప్రియ గార్ల సంగీత విభావరి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసి కట్టిపడేసింది. చివరిగా, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగ నిర్వహించిన 2023-24 సంవత్సరానికి ఎన్నికైన కార్యనిర్వాహక వర్గాన్ని ముందే వేదిక మీద పరిచయం చేయడం జరిగిందికదా!
ఈ విధంగ మీ అందరిచేత కార్యనిర్వాకులుగ ఎన్నిక కాబడడం, అందులో మేము కూడ సభ్యులుగా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం, తమ మొట్ట మొదటి కార్యక్రమాన్నే ఇంత అద్భుతంగ నిర్వహిండం వెనకున్న వారి కృషిని అభినందించకుండా వుండలేము.
ఈ సమావేశానికి విచ్చేసిన అందరిని అభినందిస్తూ, ఈ కార్యక్రమ నిర్వహణపై మీ భావాలను మాకు అందించ వలసినదిగ విజ్ఞప్తి చేస్తున్నాము.పూర్వపు కార్యనిర్వాహకుల అడుగు జాడలలో నడుస్తు హ్యూస్టన్ నగర వాసులకు సేవలందించడం మాకు ఆనందానుభూతినందిస్తోంది.