తెలుగు అసోసియేషన్ ఆఫ్ మిసిసిప్పి ‘టామ్స్’ నిర్వహణలో ఉగాది మరియు హోలీ సంబరాలు ఘనంగా పూర్తయ్యాయి. ఏప్రిల్ 3 ఆదివారం రోజున స్థానిక డీలో పార్కులో నిర్వహించిన ఈ సంబరాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏంతో ఆహ్లాదంగా సాగాయి.
ఈ సంబరాలకు ముఖ్య అతిధులుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ మరియు యుఎంఎంసి చీఫ్ డాక్టర్ విజయ్ కుమార్ ఆహ్వానించబడ్డారు. వీరిరువురు అందరితో కలియతిరుగుతూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ కలివిడిగా ఈ సంబరాలను ఆస్వాదించారు.
సుమారు 200 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉదయం అల్ఫాహారంతో మొదలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం తేనీరు అన్నీ కూడా అక్కడే వండి సమకూర్చడంతో అందరూ రుచికరమైన వంటకాలను ఆస్వాదించారు. రంగులతో హోలీ ఆడడం అందరినీ ఆహ్లాదపరిచింది.
అలాగే చిన్నారులకు సరదా సరదా ఆటలు నిర్వహించడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. డీజే పాటలకు అందరూ డాన్సులు కట్టి సరదాగా రోజంతా గడిపారు. తెలుగువారు తక్కువగా ఉండే మిసిసిప్పీలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆహూతులందరూ అభినందించారు.
కొత్త తరం యువత తెలుగు అసోసియేషన్ ఆఫ్ మిసిసిప్పి ‘టామ్స్’ ని 2021లో ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా టామ్స్ నాయకులు డాక్టర్ రమేష్ మద్దాలి, విజయ్ కుమార్ కటకం, రాజేష్ వంగ, సునీల్ నార్ల, రామకృష్ణ, గౌతం, రాజేష్ గొల్ల, రాజశేఖర్, దుర్గా ప్రసాద్, మణికంఠ మరియు టామ్స్ వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించారు.