తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta – TAMA) ‘తామా‘ వారు జాన్స్ క్రీక్ లోని న్యూటౌన్ పార్క్ లో ఆగస్టు 13, 2022 న నిర్వహించిన 5కె వాక్ ఆహ్లాదకరంగా జరిగింది. తామా ఉచిత క్లినిక్ నిధుల సేకరణ కోసం మరియు సమాజంలో అవగాహన కోసం ప్రత్యేక వార్షిక కార్యక్రమంగా ఈ 5కె వాక్ ని నిర్వహించారు.
ఉదయం 6:30 గంటల నుండి మొదలయిన వలంటీర్ల సందడితో న్యూటౌన్ పార్క్ (Newtown Park) నిద్రలేచింది. వాక్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆరంజ్ ఆర్చి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. పార్క్ అంతా స్పాన్సర్స్ బానర్స్, రిజిస్ట్రేషన్ బూత్స్, బ్రేక్ ఫాస్ట్ స్టాల్, డీజే స్టేషన్ తో కళ కళ లాడింది. త్రిపుర గారి జుంబా వ్యాయామంతో సందడి మొదలయింది. పాల్గొన్న అందరికి, ప్రత్యేక టీషిర్ట్స్, బిబ్స్ మరియు పతకాలు అందచేశారు.
తామా బోర్డు డైరెక్టర్ శ్రీరామ్ రొయ్యల గారు తమ సందేశంతో అందరిని ఉత్తేజ పరిచి వాక్ ని ప్రారంభించారు. ఈ సందర్భంలో తామా ప్రెసిడెంట్ రవి కల్లి గారు, తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు గారు, మరియు వాక్ టైటిల్ స్పాన్సర్ డాక్టర్ గురుప్రసాద్ ఘంట గారు మరియు అనేకమంది ప్రారంభ వేడుకలో పాల్గొని తమ సందేశం అందచేశారు.
తామా క్లినిక్ (TAMA Free Clinic) కోసం తమ విలువయిన సమయాన్ని, సహకారాన్ని అందిస్తున్న డాక్టర్ నందిని సుంకిరెడ్డి గారు, డాక్టర్ ప్రవీణ్ గుడిపాటి గారు, డాక్టర్ వెంకట్ చలసాని గారు, డాక్టర్ మాధవి సిద్ధాంతి గారు, డాక్టర్ నాగ కొమ్మూరి గారు మాట్లాడి వాక్ లో పాల్గొని అందరికి ప్రోత్సాహమిచ్చారు. సుమారు 300 మంది పాల్గొని వాక్ ని జయప్రదం చేశారు.
వాక్ అనంతరం అందరూ తామా వారు అందించిన చక్కని ఇండియన్ బ్రేక్ఫాస్ట్, కాఫీ, టీ లు ఆస్వాదిస్తూ అవార్డ్ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తామా ప్రెసిడెంట్ రవి కల్లి గారు మాట్లాడుతూ దాతలందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం చేయూత నిచ్చిన ముఖ్యమయిన దాతలను, మరియు డాక్టర్స్ ని క్లినిక్ కోఆర్డినేటర్ నగేష్ గారు అభినందించారు. తామా కార్యవర్గం అంతా సమర్ధవంతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.