తాజా (Telugu Association of Jacksonville Area) వారు నిర్వహించిన కార్తీక వనభోజనాలకు జాక్సన్విల్లేలోని తెలుగు వారందరూ హాజరయ్యి, కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు దూరంగా ఒకరోజు మొత్తం విశాలమైన ఆట స్థలం, ఆకాశాన్నంటే చెట్లు ఉన్న Alejandro Garces Camp Tomahawk Park ప్రకృతి ఒడిలో గడిపారు.
ముందు రోజు వరకు చలిగా ఉన్న వాతావరణం డిసెంబర్ 9 న ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం 9:00 గంటలకు గోరు వెచ్చని సూరీడు రావడంతో అందరూ ఆరుబయట అల్పాహారం మరియు తేనీరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నగా సూరీడు వేకువ తెరలు తెంచుకొని రావడంతో నులి వెచ్చని కిరణాల స్పర్శ సోకగానే పిల్లలు పెద్దలు ఆటలలో మునిగిపోయారు.
ఏ వయసు వారికి సంబందించిన ఆటలు ఆ వయసు వారికి ఉండటంతో అందరూ మహదానందంగా గడిపారు. తాజా (TAJA) అధ్యక్షులు మహేష్ బచ్చు (Mahesh Bachu) తొలుత క్రికెట్, వాలీబాల్ ఆటలను ప్రారంభించారు. పెద్దలకు మరియు పిల్లలకు త్రో బాల్, పరుగు పందాలు, నిమ్మకాయ మరియు చెంచా (లెమన్ అండ్ స్పూన్) పోటీలు నిర్వహించారు.
జాక్సన్విల్లే (Jacksonville) లోని “టేస్ట్ అఫ్ ఇండియా” భోజనాలయం వారి సహకారంతో “తాజా” వారు భోజనాలు ఏర్పాటు చేసినారు. వనంలో నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ, భోజనాలను ఆరగించారు. ఈ సందర్భంగా కొంత మంది తాజా సభ్యులు భారతదేశంలోని వారి పొలాల దగ్గర కూర్చొని తిన్నట్లుగా ఉందని చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
భోజనాల తరువాత మళ్ళీ అందరూ ఆటలలో మునిగిపోయారు. టీవీలకు, ఫోన్లకు దూరంగా పిల్లలు ఆటలాడుతుండటంతో కొంత మంది తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని వయసులవారికి ఆటలు ఏర్పాటు చేసిన మహేష్ బచ్చు ఆధ్వర్యంలోని తాజా (Telugu Association of Jacksonville Area) కార్యవర్గ సభ్యులను అభినందించారు.
తాజా (TAJA) అధ్యక్షులు మహేష్ బచ్చు కార్యక్రమాన్ని విజయంవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు ధన్యవాదములు తెలియచేసినారు. అందరూ సాయంత్రం అల్పాహారాలు పూర్తి చేసుకొని ఆనందంగా ఇంటికి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి Velivolu Florida Farms భాగస్వామి శేషగిరి రావు మండవ ఆర్ధికంగా సహకరించారు.
శ్రీమతి అరుణ మద్దిరాల, మురళి మద్దిరాల, ఉపేందర్ కోట్ల, రమణ ఆక, విజయ్ గరికపాటి, వినాయక్ గుత్తికొండ, అజయ్ చెరుకూరి, వర్మ పెన్మత్స, మల్లి సత్తి, సురేష్ మిట్టపల్లి, నాగేశ్వర రావు సూరె, సురేష్ చెంచల, రాజేష్ చందుపట్ల, కిరణ్ ముత్యాల, విశ్వం గంది, పవన్ కుమార్, మోహన్ పచ్చిపులుసు, సంపత్ నంబూరి మరియు యువ కార్యవర్గ సభ్యులు సహాయ సహకారాలను అందించారు.