డా. పైళ్ళ మల్లారెడ్డి గారి ఆధ్వర్యం లో స్థాపించబడిన తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం (TTA), మన తెలంగాణాకి ప్రతీక అయిన బ్రతుకమ్మని ప్రతీ ఏటా యావత్ అమెరికా లో వివిధ రాష్ట్రాలలో, వేలాది మంది అతిథులతో, ఆట పాటలతో విందు వినోదాలతో ఘనంగా జరుపుకుంటుంది. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ TTA న్యూయార్క్ చాప్టర్ అక్టోబర్ 2 వ తేదీన 600 లకి పైగా ఆహూతులతో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించింది.
స్థానిక తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA), న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ల సహకారం తో న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ లోని రాడిసన్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పండుగ సంబరాలు న్యూయార్క్ వాసులందరికీ తమ మాతృభూమిలోనే జరుపుకున్నామా అన్న అనుభూతిని కలుగ జేశాయి. పూలనే దేవతగా అర్చించే ఈ పండుగకి మహిళలు చిరునవ్వులతో, చక్కని ఆహార్యంతో తమ తమ కుటుంబాలతో పెద్ద సంఖ్యలో విచ్చేసి, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచి తమ తమ కుటుంబాలను, బంధు మిత్రులని చల్లగా చూసి ఆశీర్వదించమని వేడుకున్నారు.
అందంగా పూలతో అలంకరించిన వేదికపై అమ్మవారిని ప్రతిష్టించి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు మాధవి సొలేటి స్వాగతవచనాల తరవాత, దేవీ పారాయణం తో పండుగ వేడుకలు ప్రారంభించారు. న్యూయార్క్ లోని వివిధ ప్రదేశాలనుండి అందమైన బతుకమ్మలు హాల్ లోని సెంటర్ స్టేజ్ లో విరాజిల్లాయి. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ, మహిళలు దాదాపు గంటన్నర వరకు అధ్బుతంగా బతుకమ్మ నృత్యాలతో అలరించారు.
సంప్రదాయ నృత్యాలను మన ముందు తరాలకి అధ్బుతంగా నేర్పే గురు సాధన పారంజీగారి శిష్యురాళ్ళ సంప్రదాయ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. రవితేజ కిక్ సినిమా ఫేమ్, సింగర్, స్ఫూర్తి జితేందర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, పాడుతూ హుషారు చేశారు. భావితరాలకు మన సాంప్రదాయాలు చేరవేయాలనే మహాదాయశం తో జరిపే ఈ సంబరాలలో చిన్నారులు ఆసక్తిగా పాల్గొని చేసిన నృత్యాలు అందరి అభినందనలు చూరగొన్నాయి. తరవాత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి హారతి, నైవేద్యం అర్పించి బతుకమ్మలను కోలాహలంగా నిమజ్జనం చేశారు.
రీజనల్ వైస్ ప్రెసిడెంట్ మల్లిక్ రెడ్డి, గౌరవ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి టీం ని అభినందిస్తూ, కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ఆహూతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక అతిధి గా విచ్చేసిన TTA ప్రెసిడెంట్ మోహన్ పటలోళ్ల గారు వారి సతీమణి న్యూ యార్క్ బృందాన్ని అభినందించారు. TTA నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి కోశాధికారి పవన్ రవ్వ, సభ్యురాలు మాధవి సొలేటి ఏర్పాట్ల గురించి వివరిస్తూ కార్యక్రమ నిర్వహణలో NY టీం లోని బోర్డు ఆఫ్ డైరెక్టర్ లు, రీజనల్ కోఆర్డినేటర్ల సహకారాన్ని ప్రశంసించారు.
సహచర సంఘాలు తెలుగు సరస్వతిక సాంస్కృతిక సంఘం నుండి గత BOT ఛైర్మన్ పూర్ణ అట్లూరి, అధ్యక్షులు జయప్రకాష్ ఇంజపురి, వారి కార్యవర్గం, న్యూ యార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఛైర్మన్ రాజేందర్ జిన్నా, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, తానా, ఆటాల ప్రతినిధులు ఈ కార్యక్రమం లో తాము భాగం పంచుకోడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమ నిర్వహించడానికి కారణభూతులైన దాతలకు RVP మల్లిక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రాండ్ స్పాన్సర్ డా. పైళ్ళ మల్లారెడ్డి గారు, డా. భారతి రెడ్డి/రాము, డా. సుధాకర్ విడియాల/గీత, రామనాథ్ రెడ్డి లతో బాటు సహృదయంతో విరాళాలు అందించిన కమ్యూనిటీ సభ్యులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. నిర్వహణలో తోడ్పడ్డ లియో క్లబ్ సంఘ సభ్యుల, మిగతా వలంటీర్ల సహకారం మరవలేనిదన్నారు. దాదాపు 20 మైళ్ళ దూరం లో ఉన్న క్వీన్స్ నుండి TTA వేసిన ఫ్రీ బస్సులలో వచ్చిన అతిథులు, ప్రతీ ఏటా తమకి ఈ సౌకర్యం అందిస్తూ వేడుకలో భాగం పంచుకునే అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వహణకు గత నెలనుండీ ఏర్పాట్లు చేస్తూ శ్రమించిన TTA న్యూయార్క్ టీం: బోర్డు ఆఫ్ డైరెక్టర్లు – శరత్ వేముగంటి, ఉష మన్నెం, సహొదర్, శ్రీనివాస్ గూడూరు, రీజనల్ కో ఆర్డినటర్లు – యోగి వనమా, సునీల్ రెడ్డి, సత్య గగ్గినపల్లి, వాణి సింగిరికొండ, ప్రహ్లాద, సౌమ్య చిత్తరి, స్టాండింగ్ కమిటీ సభ్యులు – అశోక్ చింతకుంట, రమ వనమా లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చివరగా, నవ్వులతో కేరింతలతో కోలాహలంగా సాగిన తీన్మార్ డాన్సులు ఆహూతులందరినీ అలరించాయి.