- పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
- ప్రవాస ఆంధ్రుల పిలుపు
- రాష్ట్రంలో ఎన్ డి ఏ విజయం పై మేరీ ల్యాండ్ లో వేడుకలు
Maryland: రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించాలని ప్రముఖ వైద్యులు హేమ ప్రసాద్ యడ్ల పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రవాసాంధ్రులు సద్వినియోగం చేసుకుని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని, రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణంలోనూ భాగస్వాములై… తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి (National Democratic Alliance – NDA) అఖండ విజయం సాధించడం పట్ల ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో అమెరికాలోని మేరిల్యాండ్ (Maryland) లో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్, రామోజీరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. పాలన ఎలా ఉండాలో, ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చంద్రబాబు (Nara Chandrababu Naidu) ను చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. అరాచక, అభివృద్ధి నిరోధక శక్తులను సాగనంపడంలో ప్రజలు చైతన్యం చూపారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిందని తెలిపారు.
గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ఈ చారిత్రక విజయం అందించడంలో రామోజీరావు (Cherukuri Ramoji Rao) కీలకపాత్ర వహించారు. అక్షరాన్ని ఆయుధంగా మలచి, సమాజాన్ని అదిలించి కదలించి, ప్రశ్నించే తత్వాన్ని బోధించారు. ప్రజాస్వామ్యంలో ఆర్థిక నేరస్థులు, హంతకులకు చోటులేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి.
ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోట్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో ఏమాత్రం పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలను తరిమివేశారు. ప్రస్తుత చంద్రబాబు (Nara Chandrababu Naidu) పాలనలో పారిశ్రామికీకరణ జరుగుతుంది. పారిశ్రామిక రంగానికి అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ రావుల, శివ నెలకుదిటి, సత్యనారాయణ మన్నె, భాను మాగులూరి, శ్రీనివాస్ దామ, రాజా రావులపల్లి, శివ నెల్లూరి, రాజశేఖర్ చెరుకూరి, హరీష్ కూకట్ల, శ్రీనివాస్ సామినేని, శ్రీను పోతు, సుందర్ క్రోసూరి, మురళి ముల్పురి, హర్ష పేరమనేని తదితరులు పాల్గొన్నారు. ఈ విజయోత్సవ వేడకుల్లో పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.