ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అత్యద్భుత విజయము సాధించడంతోపాటు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నార్త్ కరోలినా (North Carolina) లోని ఛార్లెట్ (Charlotte) లో ఘనంగా విజయోత్సవ సంబరాలను నిర్వహించారు.
ఎన్నారై టీడిపి, ఎన్నారై జనసేన, ఎన్నారై బిజెపి నాయకులు 125 కార్లతో విజయోత్సవ ర్యాలీతోపాటు కూటమి (National Democratic Alliance – NDA) నాయకుల ఆధ్వర్యంలో ఛార్లెట్ (Charlotte)లోని మేనర్ ఫామ్‌హౌజ్‌లో విజయోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున జరిపారు. ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మందికిపైగా హాజరయ్యారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్నారై నాయకులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. గుంటూరు ఎంపిగా గెలిచిన డా. చంద్ర పెమ్మసాని (Dr. Chandra Sekhar Pemmasani), ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ను పలువురు అభినందిస్తూ ఎన్నారైలుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు వెళ్లి రాష్ట్రానికి సేవలందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
కాగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి అభ్యర్థుల విజయం కోసం ఛార్లెట్ తదితర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు వెళ్ళిన పలువురు తాము ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుకోసం చేసిన ప్రచార, ఇతర విషయాలను ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడియోల ద్వారా ఎన్నారైలు తమ గెలుపుకోసం చేసిన కృషిని మరవలేమంటూ, వారు చేసిన సహాయం ఇంకా కొనసాగించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ప్రగతికి కృషి చేయాలని కోరారు. జూమ్ మీటింగ్‌లో గుంటూరు ఏంపీ డా. చంద్ర పెమ్మసాని, ఎమ్మెల్యే సురేష్ కాకర్ల, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎన్నారై టీడిపి నాయకుడు జయరాం కోమటి తదితరులు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు ఎన్నారైలు ఈ విజయంకోసంపడిన కష్టాలను, చేసిన సహాయాన్ని మరువలేమన్నారు. వచ్చినవారందరికీ కార్యక్రమం తరువాత బ్రహ్మాండమైన విందు భోజనాన్ని అందించారు. ఛార్లెట్‌లోనూ, ఇతర ప్రాంతాల్లో ఉన్న టీడిపి (TDP) నాయకులు, జనసేన (JSP) నాయకులు, బిజెపి (BJP) నాయకులు పలువురు ఇతరులు ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.