తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్నారై టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా మార్చి 28 సాయంత్రం (భారత కాలమానం ప్రకారం మార్చి 29 ఉదయం) స్థానిక బావర్చి రెస్టారెంట్ ఈవెంట్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకలలో సుమారు 150 మంది పాల్గొన్నారు.
శరత్ అనంతు, మురళి బొడ్డు మరియు వినయ్ మద్దినేని ఈ కార్యక్రమాన్ని ముందుండి సమన్వయం చేసారు. ముందుగా వెంకీ గద్దె స్వాగతోపన్యాసం చేసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆహుతులుఅందరూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్నఎన్టీఆర్ పఠానికి పూలతో నివాళులర్పించారు.
అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, ఎన్నారై టీడీపీ సిటీ కౌన్సిల్ సభ్యులు పార్టీతో తమకున్న అనుభవాలను, అన్న నందమూరి తారక రామారావు 1982లో పార్టీ స్థాపించిననాటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షత, దూరదృష్టి, అలాగే 2024లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేయాలి ఇలా తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.
చాలా సంవత్సరాల తర్వాత అట్లాంటా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలసికట్టుగా ఈ కార్యక్రమానికి తరలి రావడం, అలాగే కొత్తగా అట్లాంటాలో నివాసం ఏర్పరచుకున్న యువత కూడా పాల్గొనడంతో తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ అట్లాంటా వారు ముందు ముందు నిర్వహించబోయే కార్యక్రమాలలో ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ 100 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలో ట్యాంకుబండ్ తరహాలో ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ విగ్రహానికి సహాయం చేయదలచుకున్నవారు మురళి బొడ్డు ని సంప్రదించవలసిందిగా కోరారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ 40 వసంతాల థీమ్ తో ప్రత్యేకంగా తయారుచేయించిన కేక్ కట్ చేసి అందరికీ పంచారు. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం నినాదాలతో మార్మోగించారు. వేదికనంతటినీ తెలుగుదేశం జండాలు, ఎన్టీఆర్, చంద్రబాబు మరియు పార్టీ బ్యానర్స్ తో అందంగా ముస్తాబు చేయడంతో ఆహుతులందరూ ఉత్సాహంగా ఫోటోలు తీసుకున్నారు.
కోవిడ్ తర్వాత అందునా చాలాకాలం తర్వాత ముఖాముఖీ కార్యక్రమం అవడంతో అందరూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఆహ్లాదంగా కనిపించారు. వేణు దండా వారి బావర్చి రెస్టారెంట్ సమకూర్చిన రుచికరమైన విందు భోజనాల అనంతరం, ఆహూతులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.