తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ‘టీడీఎఫ్’ గురించి పరిచయం అక్కర్లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందునుంచే అమెరికా అంతటా చాఫ్టర్స్ ఏర్పాటు చేసి సేవలందింస్తున్న సంస్థ. టీడీఎఫ్ అట్లాంటా విభాగానికి 2022 సంవత్సరానికిగాను స్వప్న కస్వా అధ్యక్ష పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి స్వప్న సమయంతో పోటీపడుతూ కార్యాచరణకు శ్రీకారం చుట్టడం హర్షణీయం. వివిధ వినూత్న మరియు ప్రయోజనకర ప్రణాళికలతో తెలుగువారందరినీ అలరించబోతున్నారని తెలియపరచిన స్వప్న, తెలంగాణ విశిష్ఠ పండుగ బతుకమ్మను అక్టోబర్ 1, 2022 న అంగరంగ వైభవంగా జరుపాలన్న ఉత్సాహానికి అద్దంపట్టేలా ముమ్మరంగా ఏర్పాట్లను చేపట్టారు. అందులో భాగంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ తొలి ఆహ్వానమును తెలంగాణ ఆడపడుచు, ఉద్యమకారిణి, గౌరవ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారాలపట్టి కల్వకుంట్ల కవిత అందుకున్నారు.
ఆలోచనల్లో ఆదర్శాలు, ఆచరణలో అద్భుతాలు అన్నట్టు ఇంకో అడుగు సేవా గమనం వైపు వేస్తూ అనాధాశ్రమాల ఆదరణలో భాగంగా కారుణ్య సింధు ఆశ్రమం మరియు జ్ఞానేశ్వర వాత్సల్య మందిరముల నుండి బాల బాలికలను దత్తతు తీసుకున్నారు. ఆహార, విద్య, వైద్య వినోద మరియు విజ్ఞానాది దశలలో వారికి అవసరమైన సదుపాయాలను మరియు ప్రోత్సాహక సేవలను అందజేయనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సహకారం కొరకు విన్నవించగా కల్వకుంట్ల కవిత నిండు మనసుతో అంగీకరించడం అభినందనీయం.
సహృదయంతో తలపెట్టు సకార్యాలకు సకలం శుభం పలుకునన్నట్లు టీడీఎఫ్ అట్లాంటా విభాగ నూతన అధ్యక్షురాలు స్వప్న కస్వా తలపెట్టు సకల కార్యాలూ శుభప్రదం కావాలని కోరుకుంటూ అందుకు తెలంగాణ ఆత్మీయ మిత్రులందరూ సదా తోడు ఉంటారని విశ్వసిస్తున్నామన్నారు టీడీఎఫ్ అట్లాంటా విభాగ ప్రవాసులు.