తెలుగు వారి కోసం నాట్స్ హ్యుస్టన్ విభాగం ఆన్ లైన్ వేదికగా ఆదాయ పన్ను విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై మార్చి 6న వెబినార్ నిర్వహించింది. ఈ వెబినార్ లో ముఖ్య అతిధిగా ప్రఖ్యాత ఆదాయ, వృత్తి పనుల నిపుణులు అనిల్ గ్రంధి పాల్గొన్నారు. ఆదాయ పన్ను విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై దిశా నిర్థేశం చేశారు.
అమెరికాలో మిలియన్ డాలర్ స్కీం, రాత్ ఐఆర్ఏ వంటి పథకాల గురించి వివరించారు. భారత దేశం నుంచి బహుమతి రూపేణా నిధులని ఎలా తీసుకురావాలనే అంశంపై స్పష్టంగా తెలిపారు. వెబినార్ ద్వారా పాల్గొన్న వందలాది తెలుగు వారికి ఆదాయపు పన్ను ఆర్ధిక అంశాలపై అనిల్ గ్రంధి పూర్తి అవగాహన కల్పించారు. వీక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
నాట్స్ బోర్డుకు ఎంపికైన సుమిత్ అరిగపూడి హ్యూస్టన్, గ్రేటర్ హ్యుస్టన్ ప్రాంతంలో నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను ఈ వెబినార్‌లో వివరించారు. నాట్స్ బోర్డు సభ్యులు, సునీల్ పాలేరు, సహా కోశాధికారి హేమంత్ కొల్ల నాట్స్ సామాజిక మాధ్యమ విభాగ ఇంచార్జి శ్రీనివాస్ కాకుమాను, హ్యూస్టన్ విభాగ సమన్వయకర్త వీరు కంకటాల తదితరులు ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
దాదాపు రెండుగంటలపాటు జరిగిన ఈ వెబినార్ ఎంతో ఉపయుక్తంగా ఉందని ఈ వెబినార్‌లో పాల్గొన్న సభ్యులు తెలిపారు. ఈ వెబినార్‌కు హ్యూస్టన్ విభాగం సహ సాంస్కృతిక సమన్వయకర్త సత్య దీవెన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ వెబినార్ నిర్వహణలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ ఛైర్ వుమన్ అరుణగంటి, నాట్స్ అధ్యక్షులు విజయ్ శేఖర్ అన్నే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.