లండన్, మార్చి 6: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ‘టాక్’ ఆధ్వర్యంలో లండన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు సుమారు వందకు పైగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి గారు మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన వారందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, టాక్ సంస్థ మహిళా నాయకత్వానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి, సంస్థ చేపడుతున్న సాంస్కృతిక సేవా కార్యక్రమాలను సభకు వివరించారు.
ఈ వేడుకలను విజయవంతం చెయ్యడానికి కొన్ని వారాల నుండి కష్టపడి పని చేసిన టాక్ మహిళా నాయకులు జాహ్ణవి దూసరి, విజితా రెడ్డి, శైలజ జెల్లా, స్నేహ నవాపేట్, సృజనా, శ్వేతా లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల నిర్వాహణలో ఎంతో సహకరించి ప్రోత్సహించిన టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి మాట్లాడుతూ దాదాపు వంద మందికి పైగా మహిళలు ఒకేచోట చేరి మహిళా దినోత్సవం జరుపుకోవడం టాక్ ప్రస్థానం లో ఇదే మొదటిసారని, ఈ వేడుకలు ఇంతటి విజయం సాధించడానికి ముఖ్య కారణం ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి కృషి, ఇతర మహిళా సభ్యుల సహాకారం, ముఖ్యంగా టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం గారి మరియు అధ్యక్షుడు రత్నాకర్ గారి ప్రోత్సాహమని వారందరిని ప్రశంశించారు.
టాక్ మహిళా సెల్ ఇన్‌ఛార్జ్ విజిత రెడ్డి దుగ్గంపుడి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పురుషులకు ధీటుగా మహిళలు అద్భుత విజయాలు సాధిస్తున్నారనీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలకు ప్రతీకగా ప్రపంచం అంతా జరుపుకునేదిగా అభివర్ణించారు. టాక్ సంస్థ లో ప్రవాస మహిళలంతా బాగస్వాములవ్వాలని మనమంతా కలిసి ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలు చెయ్యొచ్చని విజిత తెలిపారు. ఎన్నో రకాల ఆటలు, గెలిచిన వారికి బహుమతులు, మహిళలంతా ఇంటి నుండి తీసుకొచ్చిన వివిధ రకాల వంటలను ఒకరికొకరితో పంచుకొని రోజంతా సరదాగా గడిపారు. టాక్ మహిళా సెల్ కార్యదర్శి క్రాంతి రెటినేని వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి, మహిళా సెల్ ఇన్‌ఛార్జ్ విజిత రెడ్డి దుగ్గంపుడి, మహిళా సెల్ కార్యదర్శి క్రాంతి రెటినేని, పవిత్ర, స్వాతి, శ్వేతా మహేందర్, శైలజ జెల్లా, శ్రావ్య, సృజనా, స్నేహ, విద్యా తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.