Connect with us

Sports

తానా క్రీడల స్థాయిని పెంచిన జాతీయ మహిళా త్రోబాల్ ఛాంపియన్షిప్

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ మొట్టమొదటిసారిగా అందునా మహిళలకు ప్రత్యేకంగా తలపెట్టిన జాతీయ స్థాయి మహిళా త్రోబాల్ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ 3, 4 తేదీల్లో నార్త్ కెరొలీనా రాష్ట్రం, చార్లెట్ నగరంలోని స్పోర్ట్స్ కనెక్షన్ ఇండోర్ కాంప్లెక్స్ లో విజయవంతంగా ముగిసింది.

రసవత్తరంగా సాగిన ఈ మహిళా త్రోబాల్ ఛాంపియన్షిప్ ని తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ అపలాచియన్ రీజియన్ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి మరియు పటిష్టమైన స్థానిక తానా జట్టుతో సమన్వయం చేసుకుంటూ గట్టి ప్రణాళికతో క్రీడాకారిణుల నుంచి ఎక్కడా ఒక్క మాట కూడా రాకుండా నిర్వహించడంలో విజయం సాధించారు.

రెండు రోజుల పాటు ఎంతో ఉత్సాహభరితంగా జరిగిన ఈ పోటీలలో 10 జట్లు పాల్గొన్నాయి. బ్యాక్అప్ క్రీడాకారిణులతో కలిపి సుమారు 150 మంది మహిళలు అమెరికాలోని టెక్సస్, మిచిగన్, కనెక్టికట్, వర్జీనియా, సౌత్ కెరొలీనా మరియు నార్త్ కెరొలీనా రాష్ట్రాల నుండి వచ్చి మరీ పాల్గొనడంతో ఈ ఛాంపియన్షిప్ స్థాయి ఇంకో మెట్టు పైకెళ్లింది.

ముందుగా సెప్టెంబర్ 3 శనివారం రోజున ఉదయం 8 గంటలకు అల్పాహారం అనంతరం గ్రాండ్ ఓపెనింగ్ సెరిమొనీతో లీగ్ మ్యాచెస్ మొదలు పెట్టారు. మహిళలు తామేమీ తక్కువ కాదన్నట్లు మంచి పట్టుదలతో ఆడారు. గేమ్స్ మధ్యలో ఖాళీ దొరికినప్పుడు డీజే తో పాటలు పెట్టుకొని డాన్సులు వేస్తూ ఆహ్లాదకరంగా గడపడం కొసమెరుపు.

ఛాంపియన్షిప్ రెండవ రోజు సెప్టెంబర్ 4 ఆదివారం రోజున క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ మరియు ఫైనల్స్ నిర్వహించారు. సుమారు 400 మంది ప్రేక్షకుల మధ్య పోటాపోటీ వాతావరణంలో చివరకు చార్లెట్ స్పోర్టీ దివాస్ జట్టు తానా మహిళా త్రోబాల్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. అలాగే డెట్రాయిట్ ఛాంప్స్ జట్టు రన్నర్స్ గా, రిచ్మండ్ వర్జీనియా నుంచి పాల్గొన్న ఆర్.వి.ఏ సర్వైవర్స్ జట్టు మూడో స్థానంలో నిలిచాయి.

ఈ ఛాంపియన్షిప్ నిర్వహణలో మను గొండి మరియు వసంత కావూరి ల పాత్ర మరువరానిది. ప్లానింగ్ మీటింగ్స్ లో పాల్గొంటూ పక్కా ప్రణాళికతో రెండు రోజులపాటు తమ పూర్తి సమయాన్ని వెచ్చించడమే కాకుండా మూడు కోర్టుల్లో క్రీడాకారిణులందరితో చక్కగా సమన్వయం చేసుకుంటూ కీలక పాత్ర పోషించారు.

అలాగే భోజనాలు తదితర లాజిస్టిక్స్ విషయంలో మాధురి ఏలూరి, దీప్తి నన్నపనేని, మంజరి అన్నే, విజయ నెల్లి, రమేష్ ముకుల్లా, రంగనాథ్ వీరమాచనేని, సాయి కిలారు, శరత్ రావి మరియు రమణ అన్నే తోడ్పాటు అందించారు. పలువురు పిల్లలు సైతం తాము కూడా సహాయం చేస్తామంటూ ముందుకు రావడమే కాకుండా మున్ముందు నిర్వహించే టోర్నీలకు కూడా తమను ఇన్వాల్వ్ చెయ్యమని కోరడం చూస్తే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ని తానాలో భాగస్వామ్యులను చేయడంలో మరో అడుగు ముందుకు వేసినట్లైంది.

ఈ ఛాంపియన్షిప్ నిర్వహించిన తీరు చూస్తే తానా చరిత్రలో మొట్టమొదటి జాతీయ మహిళా త్రోబాల్ ఛాంపియన్షిప్ అని ఎవరూ అనుకోరని, ఇంత పకడ్బందీగా డల్లాస్ నుంచి ప్రొఫెషనల్ అంపైర్ తేజేష్ కుమార్ ని తీసుకువచ్చి, జట్ల కూర్పు, నిబంధనలు, స్పోర్ట్స్మన్షిప్ ఇలా ప్రతి విషయంలోను ఎక్కడా తగ్గకుండా నిష్పక్షపాతంగా నిర్వహించిన తీరుని వీక్షకులు సైతం అభినందించారు.

ఎటువంటి లోటుపాట్లు లేకుండా నాగ పంచుమర్తి సారధ్యంలోని అపలాచియన్ రీజియన్ జట్టు ప్రతిష్టాత్మకంగా ఈ ఛాంపియన్షిప్ ని నిర్వహించిందని చెప్పాలి. అలాగే ఎలాంటి గిల్లికజ్జాలు లేకుండా క్రీడాస్ఫూర్తిని కనబరిచేలా ఈ త్రోబాల్ ఛాంపియన్షిప్ నిర్వహించిన తీరుకి శశాంక్ యార్లగడ్డ, నాగ పంచుమర్తి మరియు వాలంటీర్లు అందరినీ పేరుపేరునా ప్రత్యేకంగా అభినందించాలి.

అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి చార్లెట్ ఫ్లై అయ్యి మరీ పాల్గొన్న మహిళల క్రీడాదక్షతకు సలాం కొట్టాల్సిందే. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారిణిలు తాము ఇప్పటి వరకు పాల్గొన్న ఛాంపియన్షిప్స్ లో కెల్లా ఈ తానా త్రోబాల్ ఛాంపియన్షిప్ ఇటు ఆతిథ్యంలోగాని అటు లాజిస్టిక్స్ లోగాని తమ అంచనాలకు మించి ది బెస్ట్ అంటూ కితాబివ్వడం విశేషం.

అలాగే క్రీడాకారిణిలు అందరూ ఈ ఛాంపియన్షిప్ ప్రతి సంవత్సరం నిర్వహించండని కోరడం చూసి తానా క్రీడల స్థాయిని చాలా పెంచారని తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ని అభినందించడం హర్షణీయం. స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్ అవ్వడంతో ఒక కొత్త పంధాలో తానా క్రీడల్లో న్యూ ఎరా మొదలుపెట్టారు శశాంక్.

బహుమతి ప్రధానోత్సవంలో భాగంగా ఈలలు, హర్షధ్వానాల మద్య అవాన్స ఐటీ సోలుషన్స్ అధినేత రాజా కాసుకుర్తి స్పాన్సర్ చేసిన ప్రైజ్ మనీలో ఛాంపియన్షిప్ విజేత స్పోర్టీ దివాస్ జట్టుకి రెండు వేల డాలర్లు, రన్నర్స్ డెట్రాయిట్ ఛాంప్స్ జట్టుకి వెయ్యి డాలర్లు మరియు మూడవ స్థానంలో నిలిచిన ఆర్.వి.ఏ సర్వైవర్స్ జట్టుకి రెండు వందల యాభై డాలర్లతోపాటు ట్రోఫీలను కూడా తానా నాయకుల చేతుల మీదుగా అందించారు.

ఈ సందర్భంగా ఛాంపియన్షిప్ కి ఇతర స్పాన్సర్స్ అయినటువంటి మూవర్స్.కామ్ అధినేత విద్య గారపాటి మరియు టెక్ రియాల్టీ అధినేత చంద్ర మావులూరి ల దాతృత్వానికి తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా నాయకులలో ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, కార్యదర్శి సతీష్ వేమూరి, కమ్యూనిటీ సేవల కోర్డినేటర్ రాజా కాసుకుర్తి, మెంబర్షిప్ బెనిఫిట్స్ కోర్డినేటర్ శ్రీని యలవర్తి, ఒహాయో వాలీ ప్రాంతీయ కార్యదర్శి నాని వడ్లమూడి తదితరులు ప్రత్యక్షంగా హాజరయ్యి మద్దతు తెలిపి తోడుగా నిలబడ్డారు. అలాగే ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తం చౌదరి గుడే మరియు మీడియా కోర్డినేటర్ ఠాగూర్ మల్లినేని కూడా హాజరయ్యారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected