రవి పొట్లూరి, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్, ఇండియా ట్రిప్ లో భాగంగా పేద విద్యార్థులకు మరియు వివిధ సేవాసమితులకు ఆర్ధిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు రాయలసీమ జిల్లాలు మొదలుకొని అటు కోస్తా జిల్లాల వరకు గత మూడు నెలలలో 100 మందికి పైగా విద్యార్థులకు ఇరవై లక్షల రూపాయలకు పైగా ఉపకారవేతనాలు అందించారు. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం నవంబర్ 5 న కర్నూలు నగరానికి చెందిన ఐదుగురు విద్యార్థులు గాయత్రి, భావన, తేజశ్రీ, పల్లవి, జగన్ మోహన్ లకు 50,000 రూపాయల ఉపకారవేతనాలు అందించారు.
తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా రవి పొట్లూరి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా విష్ణువర్ధన్ రెడ్డి, సందడి మధు, మీనాక్షినాయుడు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో తమ పిల్లల చదువులకు సహాయపడుతున్న రవి పొట్లూరి మరియు తానా నాయకులను విద్యార్థుల తల్లితండ్రులు అభినందించారు.
ఈ సందర్భంగా కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ రవి పొట్లూరి మాట్లాడుతూ తన స్వంత నిధులతో పాటు చాలా మంది మిత్రులు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నారైల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని అన్నారు. నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణా శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తామని, ఫౌండేషన్ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ తెలిపారు.