ఉత్తర అమెరికా తెలుగు సంఘం “తానా” పాఠశాలలో చదివి ఉత్తీర్ణులైన చిన్నారి బాల బాలికలకు డల్లాస్ (Dallas) నగరంలోని ఇర్వింగ్ (Irving) లో వున్న “మైత్రీస్” మీటింగ్ హాలులో సర్టిఫికెట్ల ప్రధానం వైభవంగా జరిగింది. ఈ నెల 27 ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి తానా డల్లాస్ రీజనల్ కోఆర్డినేటర్ పరమేష్ దేవినేని అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను సభికులకు పరిచయం చేశారు. తానా (TANA) వారు చేపట్టే వివిధ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పరమేష్ దేవినేని కోరారు. తానా కార్యదర్శి అశోక్ కొల్లా మాట్లాడుతూ.. తెలుగు చిన్నారులందరికి తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచి, తెలుగుని ఇష్టంగా పిల్లలకు నేర్పించాలనేది తానా పాఠశాల లక్ష్యమని తెలిపారు.
పాఠశాల చైర్మన్ నలజుల నాగరాజు మాట్లాడుతూ.. ఆన్-లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న పాఠశాల తరగతులకు 2200 మంది చిన్నారులు హాజరవుతున్నారన్నారు. బాల బాలికల కోసం వాళ్ళ స్థాయికనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో తెలుగు వాచకాలు రూపొందించి, సమర్థులైన ఉపాధ్యాయుల చేత పాఠ్య బోధన చేయిస్తున్నామన్నారు.
తెలుగు పలుకు, తెలుగు అడుగు, తెలుగు పరుగు మరియు తెలుగు వెలుగు వాచకాలు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని తెలిపారు. తల్లిదండ్రులు ఇస్తున్న ప్రోత్సాహం, సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ప్రముఖ కవి, విశ్రాంత తెలుగు అధ్యాపకులు డా. బీరం సుందరరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. బీరం సుందరరావు మాట్లాడుతూ.. బాల బాలికలు తమ మాతృ భాష తెలుగును మరింత సులభంగా ఇష్టంగా నేర్చుకునేందుకు పలు సూచనలు చేశారు. నాలుగు స్థాయిల్లో ఉత్తీర్ణత సాధించిన పిల్లల చేత తల్లిదండ్రులు తెలుగు పద్యాలు, పాటలు, కవితలు, పొడుపు కథలు, సామెతలు చదవడం ద్వారా మాతృ భాష పట్ల గౌరవం పెరుగుతుందన్నారు.
జాతి వికాసం భాష పై ఆధారపడి ఉంటుందన్నారు. స్వదేశం కంటే విదేశాల్లో తెలుగును ఆదరిస్తున్న తల్లిదండ్రులకు డా. బీరం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డల్లాస్ నగర “పాఠశాల” లో ఉత్తీర్ణులైన బాల బాలికలకు తానా ప్రతినిధులు సర్టిఫికెట్లు బహుకరించి, అభినందించారు. 2023-24 సంవత్సరానికి ఆయా తరగతుల్లో చేరే బాల బాలికల పేర్లు నమోదు చేసుకొని పాఠ్య పుస్తకాలను అందచేశారు.
ఆన్-లైన్ లో www.paatasala.tana.org ద్వార పేర్లు నమోదు చేసుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ (TANA Foundation) ట్రస్టీ శ్రీకాంత్ పోలవరపు, తానా కమ్యూనిటీ సర్వీసు కోఆర్డినేటర్ లోకేష్ నాయుడు వీరిద్దరూ తానా వారు భారతదేశంలోను మరియు అమెరికాలో చేపట్టే సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సతీష్ కొమ్మన, రాజేష్ అడుసుమల్లి, సుధీర్ చింతమనేని, అజయ్ గోవాడ, నాగరాజు తాడిబోయిన, కృష్ణ, లావణ్య, గణేష్, గాయత్రి, చైతన్య, శ్రీ లాస్య, తానా పాఠశాల (TANA Patasala) ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ తానా పాఠశాల (TANA Patasala) ఉత్తీర్ణులకు ధృవపత్రాల ప్రధానం కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి సహకరించిన శేషా గోరంట్ల, మైత్రీస్ రెస్టారెంట్ మరియు ఇతర స్పాన్సర్లందరికి పరమేష్ దేవినేని ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు.