గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు టైమ్స్ పాఠశాల తానా తో కలిసి అమెరికాలో తెలుగు తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత సంవత్సరం జయ్ తాళ్లూరి ఆధ్వర్యంలో పాఠశాలను తానాలోవిలీనం చేసుకొని స్వతంత్రంగా తెలుగు తరగతులు పెద్దస్థాయిలో మొదలుపెట్టారు. ఇప్పటికి ఒక సంవత్సరం అవ్వడంతో తానా పాఠశాల మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
అంతర్జాలంలో జరిగిన ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, తానా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ తెలుగు భాషపై అభిమానంతో స్వచ్ఛందంగా పాఠశాలలో తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ రెండు లక్షల డాలర్ల విరాళానికి ఆయన కుటుంబీకులకు ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల మాట్లాడుతూ ప్రవాస బాలలకు తెలుగు నేర్పించాలనే దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, దీనికోసం తానా కార్యవర్గం, పాఠశాల టీమ్ సమిష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రసాద్ మంగిన పాఠశాలకు “బాటా” సహకారం అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ఏర్పాటు చేసిన పాఠశాల సమ్మర్ క్యాంపుకు పెద్దసంఖ్యలో ప్రవాస చిన్నారులు హాజరయ్యారు. ఈ క్యాంపును వెంకట్ కొర్రపాటి గణేశ ప్రార్ధనతో ప్రారంభించారు. రవి పోచిరాజు నీతి కథలు బోధించారు. సత్య బుర్ర పాఠశాల పాఠ్యాంశాలపై వివరించారు. చిన్నారులకు క్విజ్ నిర్వహించారు. రజని మారం శ్లోకాన్ని ఆలపించారు. చివరగా తల్లిదండ్రులు పాఠశాల రిజిస్ట్రేషన్ లో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సమ్మర్ క్యాంపు మరో మూడు శనివారాలు జరుగుతుందని పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల తెలిపారు.