Charlotte, North Carolina: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21వ తేదీన ఛార్లెట్ కాంకర్డ్ లోని ఉన్న ఫ్రాంక్లిస్కే పార్క్ (Frank Liske Park) లో జరిగిన 5 కె రన్ కార్యక్రమానికి కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వచ్చింది. తానా నాయకులతోపాటు పలువురు తెలుగువారు కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని తానా వారు మంచి ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు.
సుమారు 300 మంది ఎన్నారై లు (NRI), చార్లెట్ నుండి 5K రన్/వాక్‌లో పాల్గొన్నారు. తానా టీమ్ స్క్వేర్ నిధుల సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని ఛార్లెట్ లోని తానా నాయకులు నిర్వహించారు. అన్నీ వయస్సుల వారు ఇందులో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఉచిత టీ-షర్టులను, పిల్లలకు నగదు బహుమతులు అందించారు.
ఎలిమెంటరీ/మిడిల్/హైస్కూల్ కు చెందిన బాలబాలికలు ఇందులో పాల్గొన్నారు విజేతలుగా నిలిచినవారికి బహుమతులను అందించారు. వచ్చినవారికి రుచికరమైన దక్షిణ భారత (South India) అల్పాహారం అందించారు. డైనమిక్ యాంకర్, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ అయిన సౌమ్యశ్రీ తలంకి ఇందులో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు.
సర్టిఫైడ్ జుంబా ఇన్స్ట్రక్టర్ అయిన మౌనిక కవలి, తన హై-ఎనర్జీ జుంబాతో ఈ కార్యక్రమానికి మరింత జోష్ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మార్గదర్శకులుగా మారథాన్ (Marathon) రన్నర్, తానా కమ్యూనిటీ సర్వీస్ అవార్డు గ్రహీత అయిన నవీన్ అప్పలనేని వ్యవహరించారు. ఆయన అంకితభావం, నాయకత్వం అందరికీ మార్గదర్శనంగా నిలిచింది.
తానా అప్పలాచియాన్ (Appalachian) ప్రాంతీయ ప్రతినిధి రవి వడ్లమూడి(నాని), తానా స్పెషల్ ప్రాజెక్ట్స్ కో ఆర్డినేటర్ నాగమల్లేశ్వర పంచుమర్తి, తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, తానా ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లినేని, తానా హెల్త్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మాధురి ఏలూరి, తానా రైతుకోసం చైర్ రమణ అన్నే, పట్టాభి కంఠంనేని తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.
రన్ తర్వాత జరిగిన సమావేశంలో తానా నాయకులు మాట్లాడారు. తానా టీమ్ స్క్వేర్ (TANA Team Square) ద్వారా తానా చేస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ, వాలంటీర్లకు, స్పాన్సర్లకు తానా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.