అమెరికాలోని ప్రవాసులకు ఇండియా వీసా, ఓసిఐ, పాస్పోర్ట్ తదితర సేవలు పొందాలంటే కొంచెం సమాయంతో కూడిన క్లిష్టమైన పని. ఎందుకంటే ఆదో పెద్ద చేంతాడు అంత ప్రాసెస్. మొదటగా భారత ప్రభుత్వ వెబ్సైటులో డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చెయ్యాలి. అక్కడ జనరేట్ అయ్యిన రిఫరెన్స్ నెంబర్ వాడి తర్వాత వీయఫ్ఎస్ గ్లోబల్ వెబ్సైటులో తతంగం పూర్తిచేసి చివరిగా అన్ని డాకుమెంట్స్ ప్రింట్ చేసి ఇండియన్ కాన్సులేట్ కి పోస్ట్లో పంపాలి.
అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ప్రజలవద్దకు పాలన తరహాలో, పెన్సిల్వేనియా లోని లీహై వ్యాలీ ప్రాంతంలో ఇండియన్ కాన్సులెట్ అధికారులే అందరికీ అనువుగా ఉండేలా ఒక సర్వీస్ క్యాంపు నిర్వచించారు. న్యూయార్క్ ఇండియన్ కాన్సులేట్, తానా తదితర సంఘాల ఆధ్య్వర్యంలో నవంబర్ 13న జరిగిన ఈ క్యాంపులో సుమారు 200 కుటుంబాలు పాస్పోర్ట్, వీసా, ఓసిఐ వంటి సేవలను వినియోగించుకున్నారు.
తానా నుంచి మోహన్ మల్ల, రఘు ఎద్దులపల్లి, సునీల్ కోగంటి అలాగే ఇండియన్ కాన్సులెట్ నుంచి జయ్ రహత్గి, నీరజ్ శర్మ ఈ కాన్సులార్ సర్వీస్ క్యాంపులో కీలక పాత్ర పోషించారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రజలవద్దకు పాలన తరహా కాన్సులార్ సర్వీస్ క్యాంపు సేవలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని తానా సభ్యులు కోరుతున్నారు.
ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో కాన్సులేట్ లేదా వీయఫ్ఎస్ గ్లోబల్ ఆఫీస్ కి వెళ్లే పనిలేకుండా సులభంగా ప్రాసెస్ పూర్తి చేసుకునే వెసులుబాటును కల్పించిన తానా మరియు ఇండియన్ కాన్సులెట్ అధికారులను అందరూ అభినందించారు.