ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) న్యూ ఇంగ్లండ్ చాప్టర్ వినాయక చవితి సంబరాలు కోలాహలంగా నిర్వహించింది. తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి సొంత ఇలాఖా అయిన న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలో సెప్టెంబర్ 23 శనివారం రోజున మసాచుసెట్స్ (Massachusetts) రాష్ట్రంలోని మెడ్వే (Medway) పట్టణంలో ఈ వినాయక చవితి సంబరాలు నిర్వహించారు.
సుమారు 300 మంది స్థానికులు ఈ వినాయక చవితి (Ganesh Chaturthi) సంబరాలలో ఆనందంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా గణనాథుని (Lord Ganesh) స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అలాగే అందరూ ఆ గణేషునికి సంబంధించి భక్తి గీతాలు ఆలపించారు.
వేదిక ప్రాంగణమంతా గణపతి బప్పా మోరియా నినాదాలతో మారుమోగిపోయింది. మహిళలు కోలాటం ఆడారు. ఆహ్వానితులందరూ సాయం సమయాన భక్తి పారవస్యంలో మునిగితేలారు. ప్రసాదం పంచిపెట్టారు. చివరిగా గణేష్ నిమజ్జనం (Lord Ganesh Immersion) తో తానా వారి వినాయక చవితి సంబరాలు ముగిశాయి.
న్యూ ఇంగ్లండ్ (New England) ప్రాంతీయ కార్యదర్శి కేపీ సోంపల్లి (KP Sompally), తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఎండూరి, చాంద్, శ్రీని గొండి, శ్రీనివాస్ కొల్లిపర, వాలంటీర్స్ భార్గవ్ ప్రక్కి, సురేష్ దోనెపూడి, శ్రీనివాస్ కంతేటి, శ్రీహరి వెలివేటి, వెంకట్ కొప్పవోలు, వేణు కూనంనేని, రమణ తిరువీది, రవి దడిరెడ్డి, ఉమ నల్లూరి, శారద ప్రక్కి తదితరులు ఈ వినాయక చవితి సంబరాలలో తలా ఒక చేయి వేశారు.
వినాయక చవితి సంబరాలను ఇండియాలో వలే కోలాహలంగా నిర్వహించిన తానా న్యూ ఇంగ్లండ్ ప్రాంత నాయకులను, తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ (TANA Foundation) ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి మరియు తానా బోర్డు ఛైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి లను స్థానిక తెలుగువారు అభినంచించారు.