మహిళామణుల ఆనందోత్సాహాల నడుమ తానా లేడీస్ నైట్ ఘనంగా జరిగింది. అక్టోబర్ 21 శుక్రవారం రాత్రి అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం, డెట్రాయిట్ ఫార్మింగ్టన్ హిల్స్ లో ఈ మహిళా ఉత్సవం జరిగింది. మహిళామణులు భారీ సంఖ్యలో 500 మంది కి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 80 వేల డాలర్ల విరాళాలు అందించి తమ సత్తా చాటారు.
ఆటపాటలతో, విందు వినోదాలతో, ఉల్లాసంగా జరిగిన ఈ కార్యక్రమం మహిళలలో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఈ కార్యక్రమం తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు గారు, తానా ఫౌండేషన్ ట్రస్టీ సురేష్ పుట్టగుంట గారు, మను గొంది గారి సారధ్యంలో జరిగింది.
ఈ సందర్భంగా నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ “ఈ కార్యక్రమానికి మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, గౌరవించ పడతారో అక్కడ దేవతలు ఉంటారు అంటారు. మహిళలను గౌరవించడం అందరి కర్తవ్యం. మహిళా శక్తి అసాధారణమైనది. మహిళా మణులు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. మహిళల్లో చైతన్యం కలిగించడానికి వారికి వినోదంతో పాటు వికాసం కలిగించటానికి తానా ఫౌండేషన్ ఈ లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తానా చేస్తున్న చారిటీ కార్యక్రమాలలో మహిళలు పాల్గొని సహాయం అందించాలని” అన్నారు.
తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చైర్మన్ హనుమయ్య బండ్ల గారు మాట్లాడుతూ “తానా మొదటి నుంచి మహిళా సేవలకు పెద్దపీట వేయడం జరిగింది. మహిళా సాధికారత దిశగా తానా తాన వంతు కృషి చేస్తుంది” అని అన్నారు. సురేష్ పుట్టగుంట గారు మాట్లాడుతూ “ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన 80,000 డాలర్ల విరాళాలు తానా అన్నపూర్ణ ప్రాజెక్టు (ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్య ఉచిత అన్నదాన కార్యక్రమం) ఒక సంవత్సరం కాలం పాటు కొనసాగించేందుకు ఉపయోగించడం జరుగుతోంది” అని అన్నారు.
తానా ఉమెన్ కో ఆర్డినేటర్ ఉమా కటికి మాట్లాడుతూ “సహనానికి- సాహసానికి, ఓర్పు కి- నేర్పు కి ప్రతిబింబాలు స్త్రీలు. ఇటీవల కాలంలో వారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని పోవడం అభినందనీయమన్నారు. మను గొంది మాట్లాడుతూ “మా ఆహ్వానం మన్నించి ఇంత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం సంతోషంగా ఉంది.ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పని చేసిన వారికి ధన్యవాదాలు” అని అన్నారు.
తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల గారు కార్యక్రమం సమన్వయ కర్తగా వ్యవహరించారు. నమస్తే ఫ్లేవర్ రెస్టారెంట్ వారు చక్కని విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి ప్రత్యేక అతిథులుగా యాంకర్ ఉదయభాను, సినీ గాయని మంగ్లీ హాజరై అందరినీ అలరించారు.
ఈ కార్యక్రమం తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారి ప్రోత్సాహంతో జరిగింది. తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ గారు, రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గోగినేని గారు, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లక్ష్మీ దేవినేని గారు తదితరుల పర్యవేక్షణలో ఘనంగా జరిగింది.
రాణి అల్లూరి గారు వందన సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్లకు, స్పా న్సర్ లకు, డోనార్లకు, ప్రతీ ఒక్కరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేశారు.