ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గుంటూరు జిల్లా మాచర్ల లో నివాసముంటున్న భారతదేశ త్రివర్ణ పతాక రూపకర్త స్వర్గీయ శ్రీ పింగళి వెంకయ్య గారి కుమార్తె శ్రీమతి ఘంటసాల సీతామహాలక్ష్మీ గార్ని పరామర్శించి తానా సంస్థ తరపున జ్ఞాపిక, దుశ్శాలువా, పూలమాల, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి, పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సంధర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ “ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న భారతీయులందరూ మన త్రివర్ణ పతాకాన్ని వినువీధుల్లో రెపరెపలాడించి, భారత దేశ 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ‘అజాదీ కా అమృత మహోత్సవ్’ పేరుతో ఘనంగా జరుపుకోవడానికి సమాయత్తమైవుతున్న ఈ తరుణంలో, భారత జాతీయ పతాక రూపకల్పన జరిగి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మన తెలుగువారి కీర్తిని దశదిశలా వ్యాప్తిజేసిన ఆ పతాక రూపకర్త స్వర్గీయ శ్రీ పింగళి వెంకయ్య గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి 100 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన (డిసెంబర్ 14) వారి కుమార్తె శ్రీమతి సీతామహాలక్ష్మీ గార్ని ప్రత్యక్షంగా కలుసుకుని ఆమెను సత్కరించుకోవడం నా జీవితంలో ఒక అరుదైన అవకాశం, అదృష్టం, దీంతో మా తానా సంస్థ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసుకున్నట్లయ్యంది” అని ప్రకటించారు.
“తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి స్వయంగా మాచర్ల వచ్చి మా నాన్న శ్రీ పింగళి వెంకయ్య గార్కి నివాళులర్పించి, నన్ను సత్కరించి వారి ప్రేమాభిమానాలను చూపడం, నాకు జరిగిన ఈ సన్మానం నా తండ్రికి జరిగినట్లుగా భావిస్తున్నానని, మా కుటుంబం తరపున చౌదరి గార్కి మరియు తానా సభ్యులందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు శ్రీమతి సీతామహాలక్ష్మీ. శ్రీమతి సీతామహాలక్ష్మీ అంజయ్య చౌదరిని దుశ్శాలువ తో సత్కరించి తన కుమారుడు జి.వి.యన్. నరసింహం వ్రాసిన ‘శ్రీ పింగళి వెంకయ్య జీవిత చరిత్ర’ పుస్తకాన్ని బహూకరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తానా బోర్డు సభ్యులు నిమ్మలపూడి జనార్ధన్, శ్రీ పింగళి వెంకయ్య మనుమడు జి.వి.యన్. నరసింహం, వారి కుటుంబ సభ్యులు, మాచర్ల లోని మీనాక్షి కంటి ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ చిరుమామిళ్ల కృష్ణయ్య వారి బృందం పాల్గొన్నారు.