తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) యువతేజం శశాంక్ యార్లగడ్డ క్రీడా కార్యదర్శి పదవి ముగిసిన తరుణంలో మరో వినూత్న కార్యక్రమంతో వార్తల్లో నిలిచారు. 2023 ICC అండర్ 19 ప్రపంచ మహిళా టీ20 క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులో ఆడిన తెలంగాణ క్రీడాకారిణి త్రిష గొంగడి గురించి అందరికీ తెలిసిందే.
పేద కుటుంబానికి చెందిన త్రిష (Trisha Gongadi) క్రికెట్ ట్రైనింగ్, ఫిట్నెస్, ఆట పరికరాలు, ఆరోగ్యం తదితర అవసరాల నిమిత్తం శశాంక్ యార్లగడ్డ ని సంప్రదించడంతో తానా తరపున ఫండ్రైజర్ మొదలు పెట్టి నిధుల సమీకరణ చేశారు. ఈ ప్రాసెస్ లో దేవుడు కూడా త్రిష పై చల్లని చూపు చూశాడు.
త్రిష కు ఒక మంచి కార్పోరేట్ సంస్థ నుంచి స్పాన్సర్షిప్ వచ్చింది. దీంతో తానా ఫండ్రైజర్ ద్వారా సేకరించిన నిధులతో త్రిష లాంటి ఇతర పేద క్రీడాకారులకు సహాయం చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా వివిధ మార్గాల్లో వెతికిఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి 9 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు.
వీరందరూ కూడా రంజీలు, ఇతరత్రా క్రికెట్ టౌర్నమెంట్స్ ఆడుతున్న యువ క్రీడాకారులే. వీరందరికీ ఆగష్టు 19 శనివారం రోజున హైదరాబాద్ (Hyderabad) లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఇంగ్లీష్ విల్లో (English Willow) బ్యాట్స్ అందించారు శశాంక్ యార్లగడ్డ.
ఈ సహాయం అందుకున్న వారిలో వైష్ణవి యాదవ్ కుందెరపు (17), సహస్ర వెంకట్ శంకరి (17), శ్రీ అఖిలేష్ కొమ్ము (16), క్రాంతి రెడ్డి (16), సృజన ఎడ్ల (18), శశాంక్ కేవీ (16), మురళి అక్షిత్ జి (13), షీమ షేక్ (15) మరియు సుస్మిత (15) ఉన్నారు. వీరందరూ తానా, ప్రత్యేకంగా శశాంక్ యార్లగడ్డ కి కృతజ్ఞతలు తెలియజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా శశాంక్ యార్లగడ్డ మాట్లాడుతూ.. #TANANexGen నినాదంతో ముందుకు నడిచిన తనకు #NexGen క్రికెట్ ఆణిముత్యాలను కలుసుకోవడం, సహాయం చేయగలగడం ఆనందంగా మరియు గౌరవంగా ఉందన్నారు. ఇటువంటి అవకాశం అందరికీ రాదన్నారు.
అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, తానా బోర్డ్ ఛైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ మాజీ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, తానా మీడియా సమన్వయకర్త సుమంత్ రామినేని, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ కూకట్ల, తానా క్రీడా కార్యదర్శి నాగ పంచుమర్తి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
శశాంక్ యార్లగడ్డ గత రెండు సంవత్సరాలుగా తానా క్రీడలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. #TANANexGen నినాదంతో ఎన్నో సరికొత్త క్రీడలకు అంకురార్పణ చేశారు. క్రీడాస్ఫూర్తిని ఇనుమడింపజేస్తూ రెండు సంవత్సరాల్లో అమెరికా మరియు ఇండియాలో కలిపి సుమారు 45 క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.
ఏదో తూతూ మంత్రంగా నడుస్తున్న తానా క్రీడలను సృజనాత్మక ఆలోచనలతో నెక్స్ట్ జనరేషన్ యువతని తానా క్రీడల్లో భాగస్వాములను చేస్తూ తానా వైపు తిప్పారు. 45 ఏళ్ళ తానా క్రీడల గతిని మార్చిన ది అన్ స్టాపబుల్ నెక్స్ట్ జనరేషన్ కార్యదక్షుడు శశాంక్ యార్లగడ్డ అనడం అతిశయోక్తి కాదు.