ఆపదలో ఉన్నవారికి కొండంత అండగా నిలిచే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ మరొక్కసారి ఉదారతను చాటుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన గోదావరి వరద బాధితులకు ఆసరాగా నిలిచింది ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ నేతృత్వంలోని తానా ఫౌండేషన్.
వివరాలలోకి వెళితే… ఈ మధ్యనే కురిసిన వర్షాలకు గోదావరి పరీవాహ ప్రాంతాలలోని పలు గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. సమీప ప్రాంతాలన్నీ నీట మునగడంతో వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇళ్ల లోకి నీరు రావడంతో తినడానికి, ఉండటానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో వీరందరూ సహాయం కోసం దీనంగా చూస్తున్న సంగతి యార్లగడ్డ దృష్టికి రావడంతో తానా ఫౌండేషన్ సభ్యులందరితో సమన్వయపరిచి జట్టుగా మెరుపు వేగంతో స్పందించారు. ముందుగా త్వరిత గతిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కూనవరం మండలంలోని కాచవరం గ్రామ వాసులకు ఆగష్టు 5న నిత్యావసర వస్తువులు మరియు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.
ఇంకా మరింత పెద్ద ఎత్తున బాధాతృప్త హృదయాలను ఆదుకునేలా తానా ఫౌండేషన్ తరపున ఫండ్రైజర్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా దాతలు అందరూ పెద్దమనసుతో ముందుకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలకు చేదోడు వాదోడులా దాతృత్వంతో తలా ఒక చెయ్యి వేసి భరోసానివ్వాలని పిలుపునిచ్చారు యార్లగడ్డ.
ఆపద కాలంలో వెంటనే స్పందించి సాయం చేసి అపన్న హస్తం అందించిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ సభ్యులకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఎక్కడో పరాయి దేశంలో ఉన్నప్పటికీ గుర్తు పెట్టుకొని మరీ ఆపదల్లో ఆసరాగా ఉంటున్న తానా ఫౌండేషన్ ను తెలుగు ప్రజలు అభినందిస్తున్నారు.
తానా ఫౌండేషన్ ట్రస్టీ మరియు తానా ఫౌండేషన్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ రవి సామినేని ఈ సహాయ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. మరిన్ని ఫోటోలకు ఎన్నారై2ఎన్నారై.కామ్ ని సందర్శించండి. అలాగే మీ వంతు సహాయం చేయడానికి తానా ఫౌండేషన్ వెబ్సైటును సందర్శించండి.