తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ మరోసారి చేయూత స్కాలర్షిప్స్ అందజేసింది. సురభి థియేటర్ కళాకారుల కుటుంబాలకు చెందిన 14 మంది విద్యార్థులకు మరియు 6 గురు బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న పేద విద్యార్థులకు శనివారం మే 14న హైదరాబాద్ లో తానా చేయూత స్కాలర్షిప్స్ అందజేశారు.
వివరాలలోకి వెళితే… సురభి థియేటర్ కళాకారులు నాటకాలు వేస్తూ కళలను మన ముందు తరాల వారికి చేరేలా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే వారి జీవనాధారం కూడా. కాకపోతే గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ మహమ్మారి కారణంగా నాటకాలు ప్రదర్శించే అవకాశాలు లేకపోవడం వల్ల వారి జీవనభృతి దెబ్బతిన్నది. ఇప్పుడిప్పుడే అమెరికా వంటి దేశాల్లో ఉన్న మన తెలుగు సంఘాల ద్వారా అర కొర ఆన్లైన్ అవకాశాలు వస్తున్నప్పటికీ కోవిడ్ ముందటి పరిస్థితికి ఇంకా చేరుకోలేదు.
దీంతో సురభి థియేటర్ కళాకారులు తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ని సంప్రదించారు. అడిగిందే తడవుగా తానా చేయూత స్కాలర్షిప్స్ సమన్వయకర్త శశికాంత్ వల్లేపల్లి మరియు తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ తమకు తోచినంత సహాయం చేయడానికి ముందుకు రావడం, అలాగే స్కాలర్షిప్స్ అందజేయడం చకచకా జరిగిపోయాయి.
హైదరాబాద్ లో శనివారం మే 14న నిర్వహించిన ఒక కార్యక్రమంలో శశికాంత్ వల్లేపల్లి మరియు న్యాయవాది రామకృష్ణ గొట్టిపాటి చేతుల మీదుగా సురభి థియేటర్ కళాకారులకు మరియు విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది రామకృష్ణ గొట్టిపాటి రెండు తెలుగు రాష్ట్రాల్లో తానా చేస్తున్న సేవాకార్యక్రమాలను కొనియాడుతూ, దీనికి సహకరిస్తున్న అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ మరియు తానా లీడర్షిప్ ని అభినందించారు.
అనంతరం సురభి థియేటర్ కళాకారుల సంఘం కార్యదర్శి జయానంద్ మాట్లాడుతూ… అడిగిన వెంటనే స్పందించి తమకు ఈ తానా చేయూత స్కాలర్షిప్స్ ద్వారా సహాయం త్వరగా అందేలా చేసిన తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ కి ధ్యన్యవాదాలు తెలియజేశారు.