Connect with us

Donation

బెజవాడ బెంజ్ సర్కిల్‌ లో మహిళలకు తానా కుట్టుమిషన్ల పంపిణీ, గద్దె రామ్మోహన్‌ హాజరు

Published

on

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (TANA) ద్వారా తెలుగురాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ చేస్తున్న సేవలకు తోడుగా తానా తరపున కూడా సేవ, సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి (Sasikanth Vallepalli) తెలిపారు.

గురువారం సాయంత్రం బెంజిసర్కిల్‌ సమీపంలోని ఎస్‌.వి.ఎస్‌ కళ్యాణమండపంలో పుట్టగుంట వీరభద్రరావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు తానా ఫౌండేషన్‌ ట్రస్టీ పుట్టగుంట సురేష్‌ (Suresh Puttagunta) ఆర్ధికసహాయంతో 100 మంది మహిళలకు 100 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ చేతుల మీదుగా అందజేశారు. అలాగే రాఖీ పండుగను పురస్కరించుకుని గద్దె రామ్మోహన్‌ తన సొంత నిధులతో మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శశికాంత్‌ వల్లేపల్లి మాట్లాడుతూ.. తెలుగువారిగా పుట్టి అమెరికాలో స్థిరపడి తెలుగురాష్ట్రాలోని ప్రజలకు సేవ చేయాలనే దృక్పధంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రతి ఏడాది కూడా ఐ-క్యాంపులు, మెడికల్‌ క్యాంపులతో పాటు రవి సామినేని (Ravi Samineni) సహకారంతో ఆదరణ ద్వారా అనేక మందికి ట్రై సైకిల్స్‌ అందజేసినట్లు తెలిపారు. ఇక్కడ గద్దె రామమోహన్‌ (Gadde Ramamohan Rao) వేలాది మందికి ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్నారని, ఆయన సేవలకు తోడ్పాటు అందించేందుకు పుట్టగుంట సురేష్‌ రూ.6 లక్షల 50 వేలతో కుట్టు మిషన్లు అందజేశారన్నారు.

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు వారికి స్వయం ఉపాధి చేసుకునేందుకు తానా ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమన్నారు. జన్మభూమికి సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతో సేవలు చేస్తున్న అంతర్జాతీయ సంస్థ తానా అన్నారు. తానా వారు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి అనేక మంది పేదలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని, అలాగే వైద్య ఖర్చులు అందిస్తున్నారని, ఎటువంటి స్వార్ధం లేకుండా ఇటువంటి సేవలు చేస్తున్న తానా వారి సేవలు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతున్నాయన్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పుట్టగుంట వీరభద్రరావు జ్ఞాపకార్ధం ఇంత పెద్దఎత్తున కుట్టుమిషన్లు అందజేసిన పుట్టగుంట సురేష్‌ కు, తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు కు నియోజకవర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, పుట్టగుంట రమేష్‌, చెన్నుపాటి కాంతిశ్రీ గాంధీ, ముమ్మనేని ప్రసాద్‌, చెన్నుపాటి ఉషారాణి, పొట్లూరి సాయిబాబు, రాయి రంగమ్మ, నందిపాటి దేవానంద్‌, ఎం.దేవేంద్ర, రత్నం రమేష్‌, చిప్పాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected