ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్’ మరియు ‘నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్’ వారికి పేదల సహాయార్ధం నవంబర్ 23న ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. కోవిడ్ మహమ్మారితో ఎందరో ఉపాధి కొల్పోయి మనుగడ ఎలా సాగించాలో అని సతమతం అవుతున్న పరిస్థితుల్లో “అన్న దాత సుఖీభవ, మానవ సేవే మాధవ సేవ” అనే నినాదంతో తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన మరియు తానా బృందం సారధ్యంలో అమెరికా దేశంలో నివసిస్తున్న పేదవారికి తిరిగి మనవంతు సహాయసహకారాలు అందించాలనే సదుద్దేశంతో 3000 మందికి పైగా ఒక్కరోజుకి సరిపడే వివిధ రకాల ఆహార పదార్ధాలను దానం చేశారు.
మన తెలుగువారెందరికో అమెరికా జీవనోపాధి కల్పించి, సొంత పౌరులుతో సమానంగా పనిచేయడంలో, మన ప్రవాసుల ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు కల్పించిదనడంలో ఎటువంటి సందేహంలేదు. మనకు ఎంతో ఇచ్చిన దేశానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రవాసంలో వున్న తెలుగు వారితో పాటు అమెరికా సమాజంతో మమేకమై ఇక్కడ పేదరికంలో వున్న వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్పడానికి చాలా ఆనందంగా వుందన్నారు. ఇటువంటి సమాజసేవాకార్యక్రమాలు చేపట్టడానికి, తానా లాంటి స్వచ్చంద సంస్థకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన దాతలు మరియు కార్యకర్తలకు తానా బృందం ధన్యవాదాలు తెలియజేశారు. తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, మరిన్ని జన ప్రయోజనకరమైన కార్యక్రమాలతో అన్ని సంస్థలతో కలసి పనిచేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, రాబోయే కాలంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు తానా బృందం సహకారంతో మీ ముందుకు వస్తామని, అందరు తానా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.
తానా కార్యవర్గ బృందం మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, రాజేష్ అడుసుమిల్లి, సాంబ దొడ్డ, పరమేష్ దేవినేని, చినసత్యం వీర్నపు, నాగరాజు నలజుల, డా. ప్రసాద్ తోటకూర, కళ్యాణి తాడిమేటి, మధుమతి వైశ్యరాజు, దీప్తి సూర్యదేవర, చంద్ర పోలీస్, ప్రమోద్ నూతేటి, శ్రీదేవి ఘట్టమనేని, లెనిన్ వీరా, గణెష్ నలజుల, వెంకట్ బొమ్మ తదితరులు విరాళాలు అందించి, కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఫుడ్ డ్రైవ్ చేపట్టడానికి సహకరించిన ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్ మరియు నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్ వారికి, వివిధ ప్రసార మాధ్యమాలకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు.