Connect with us

Conference

తానా సార్, తానానే! అంచనాలకి మించి 8 వేలకి పైగా బాంక్వెట్ కి హాజరు: Day 1 @ TANA Convention

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) ‘తానా23వ మహాసభలు నిన్న జులై 7 శుక్రవారం రోజున ఫిలడెల్ఫియా (Philadelphia) లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.

కోవిడ్ కారణంగా 4 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తుండడంతో ఏమో కానీ తానా (TANA) మూడు రోజుల పండుగకి అమెరికాలోని తెలుగువారు అందరూ నిజంగా వేచిచూస్తారనే నానుడిని నిజం చేస్తూ తానా సార్ తానానే అనే విధంగా బాంక్వెట్ లో ఎటు చూసినా జన సందోహమే.

అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ సుమారు 8 వేల మందికి పైగా తానా మహాసభల మొదటి రోజైన బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చూసిన వారికి దిస్ ఈస్ నాట్ ఏ వన్ టైం రికార్డ్, ఇట్స్ యాన్ ఆల్ టైం రికార్డ్ అనే మహేష్ బాబు (Mahesh Babu) సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది.

దీనికి తోడు హేమాహేమీల వంటి అతిథులతో కన్వెన్షన్‌ సెంటర్‌ కిక్కిరిసి పోయింది. సాయంత్రం 5 గంటలకు సోషల్ అవర్ తో కార్యక్రమం మొదలైంది. టాలీవుడ్ (Tollywood) ప్రముఖ యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) ఆహ్వానితులందరికీ సాదరంగా స్వాగతం పలకారు.

ప్రార్ధనా గీతంతో శుభసూచకంగా వేదికపై కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తానా మహాసభల లీడర్షిప్ అంజయ్య చౌదరి లావు, రవి పొట్లూరి స్వాగతోపన్యాసం గావించి బాంక్వెట్ ఇనాగరల్ గావించారు. తానా నాయకులు మహాసభల సావనీర్ (Souvenir) ని ఆవిష్కరించి అందరికీ అందజేశారు.

అమెరికాలోని ఇతర జాతీయ తెలుగు సంఘాల (Telugu Associations) నాయకులను అందరినీ వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. ఇదిలా నడుస్తుండాగా ఇంతలోనే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఎంపీలు రఘు రామ కృష్ణం రాజు (RRR) & కనకమేడల రవీంద్ర, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు విచ్చేశారు.

అలాగే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డా. నూతలపాటి వెంకటరమణ, నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ (Gadde Rajendra Prasad), మాగంటి మురళీ మోహన్‌, హీరో నిఖిల్‌ సిద్దార్థ, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela), ఎమ్మెల్యే సీతక్క, భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు & చైర్మన్‌ కృష్ణ ఎల్ల, నిర్మాత దిల్ రాజు, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తదితరులు ప్రాంగణంలోకి ప్రవేశించారు.

వివిధ రంగాలలో నిష్ట్నాతులకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. అలాగే బాలయ్యని కూడా సన్మానించారు. తర్వాత బాక్స్ ఆఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా మెరిటోరియస్ అవార్డులు అందజేశారు.

అనంతరం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డా. నూతలపాటి వెంకటరమణ (Nuthalapati Venkata Ramana) & సినీ నిర్మాత దిల్ రాజు (Dil Raju) చేతుల మీదుగా ప్రెసిడెన్షియల్ & ప్రత్యేక అవార్డులు అందజేశారు. అలాగే అతిథులను శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.

పనిలో పనిగా బాంక్వెట్ మరియు అవార్డు కమిటీల సభ్యులను కూడా సన్మానించారు. కోవిడ్ వ్యాక్సిన్ ‘కొవాక్సిన్’ (Covaxin) ప్రధాత, భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) వ్యవస్థాపకులు & చైర్మన్‌ కృష్ణ ఎల్ల (Krishna Ella) ప్రసంగం ఆసక్తి కలిగించింది.

ఇందంతా మెయిన్ స్టేజ్ పై నడుస్తుండగా, పక్కన బాల్ రూమ్ లో యూత్ బాంక్వెట్ (Youth Banquet) సాగింది. కాప్రీసియో బ్యాండ్ (Capricio Band) యువతను అదరగొట్టింది. అలాగే చిన్న పిల్లల కోసం తానా (TANA) వారు ప్రత్యేక ఏర్పాటు చేయడం విశేషం.

తెలుగు సినిమా పాటల మెడ్లి డాన్స్ తో కవి స్కూల్ ఆఫ్ డాన్స్ విద్యార్థులు ఆకట్టుకున్నారు. చివరిగా ప్రముఖ నేపథ్య గాయని చిత్ర (KS Chithra), సింహ, కౌసల్య తమ ట్రూప్ తో అందరినీ పరవశులను చేశారు. పాత చిత్రాలలోని సూపర్ హిట్ పాటలను ఆలపించి ఆహుతులను ఆస్వాదించేలా చేశారు.

మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/23rd TANA Convention in Philadelphia ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected