తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ సేవాకార్యక్రమాలు వేటికవే సాటి. అయినప్పటికీ తానా ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ‘చేయూత’ ప్రాజెక్ట్ మాత్రం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈరోజుల్లో చదువుకోడానికి సహాయం చేయడం గొప్పవిషయం. చదువుకొని పైకొస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడమే కాకుండా మరికొందరికి సహాయపడే అవకాశం ఎక్కువ.
దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తానా చేయూత ప్రాజెక్ట్ ద్వారా అనాధ మరియు పేద విద్యార్థులకు ధన సహాయం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి ప్రస్తుత సమన్వయకర్త మరియు తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో మార్చి 19న మరో 160 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో సుమారు 17 లక్షల రూపాయల ఉపకారవేతనాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ముఖ్య కార్యదర్శి ఆర్.పి. సిసోడియా మరియు మాజీ డీజీపీ మాలకొండయ్య ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. పాతూరి నాగభూషణం, డాక్టర్ కే.ఆర్.కే ప్రసాద్ మరియు అన్నపూర్ణ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఉన్నారు.
ఈ ఉపకారవేతనాల సమర్పకులు నీలిమ వల్లేపల్లి, విష్ణు దోనేపూడి, శశికాంత్ వల్లేపల్లి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు. ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ కార్యదర్శి మరియు తానా చేయూత ప్రాజెక్ట్ సమన్వయకర్త శశికాంత్ వల్లేపల్లి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తానా చేయూత ప్రాజెక్ట్ విశిష్టతను, లక్ష్యాన్ని వివరిస్తూ విద్యార్థులను మోటివేట్ చేసారు.