ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ‘చేయూత’ ప్రాజెక్ట్ మరోసారి అందరి మన్ననలు పొందుతుంది. తానా చేయూత ప్రాజెక్ట్ ద్వారా అనాధ మరియు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థులకు ఎప్పటినుంచో ఉపకార వేతనాలు ఇస్తూ వస్తున్నారు.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా సీఎస్ పురంలో 30 మంది పేద విద్యార్థులకు తానా ఉపకార వేతనాలు అందజేశారు. ఈ ఉపకార వేతనాలకి దాత ఎన్నారై మాధురి ఏలూరి. ప్రస్తుతం ఇండియా ట్రిప్ లో ఉన్న మాధురి గత జులై 30 శనివారం రోజున ఉపకార వేతనాలు విద్యార్థులకు అందజేశారు.
స్థానికంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో నార్త్ కరోలినా రాష్ట్రం, చార్లెట్ నగర వాసి మాధురి మరియు కొంతమంది పెద్దల చేతుల మీదుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. తానా చేయూత ప్రాజెక్ట్ ప్రస్తుత సమన్వయకర్త మరియు తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి సమన్వయం చేశారు.
2021-23 కి గాను ఉమెన్ ఎంపవర్మెంట్ ఛైర్ గా తానాకు సేవలందిస్తున్న మాధురి ఏలూరి ముందుకు వచ్చి విద్యార్థులకు ఆసరాగా నిలవడంతో విద్యార్థులు, తల్లితండ్రులు ఆమెను కొనియాడారు. అలాగే తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ లను అభినందించారు.