అక్టోబర్ 8న హార్ట్ ఆఫ్ ది యూనివర్స్ గా పిలవ బడే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లోని డప్పీ స్క్వేర్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ బంగారు బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది.సాయంత్రం 3:30 గంటలకు ప్రారంభించేలా మరియు తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ తానా బతుకమ్మ వేడుకలో టాలీవుడ్ ప్రముఖ నటి మరియు యాంకర్ అనసూయ భరద్వాజ్ పాల్గొననున్నారు. అలాగే ఫోక్ సింగింగ్ సెన్సేషన్ మంగ్లి బతుకమ్మ పాటలతో అందరినీ అలరించనున్నారు. బతుకమ్మ ఆటపాటలు, గర్భా, సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాఫుల్ బహుమతులు, బతుకమ్మ పోటీలు అందరినీ ఆకట్టుకోనున్నాయి. దీనికి సంబంధించి జయ్ తాళ్లూరి, శిరీష తూనుగుంట్ల తదితరులు టీవీ9 తో మాట్లాడారు.
కోటి రతనాల వీణ నా తెలంగాణ అన్నారు. ఎన్నో జాన పద, లలిత కళలకు జన్మ నిచ్చిన రత్న గర్భ తెలంగాణ రాష్ట్రం. ప్రాచీన సంస్కృతి, నాగరికతలకు జన్మ స్థలి తెలంగాణ. ఉద్యమాలకే కాదు ఉత్సవాలకు కూడా తెలంగాణ పెట్టింది పేరు అని మరోమారు నిరూపించేలా ఈ ‘తానా’ బతుకమ్మ పండుగను నిర్వహించనున్నారు. రెజిస్ట్రేషన్ వివరాలకు క్రింది ఫ్లయర్ చూడండి.
బతుకమ్మపండుగను దిగ్విజయంగా నిర్వహించి వేల కిలో మీటర్ల దూరంలో ఉన్న మన మాతృ భూమి కీర్తి పతాకాన్ని రెపరెప లాడిద్దాం. మన జీవన మూలాల్లోని అమూల్యమైన పావన విలువల్ని విశ్వ వ్యాప్తం చేద్దాం. రక రకాల పూలతో, బతుకమ్మను అలంకరించి ఆట పాట లతో ఆ తల్లిని మనసారా అర్చన చేద్దాం రండి అంటున్నారు తానా వారు.