Atlanta, Georgia: అట్లాంటా మహానగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యాన అంగరంగ వైభవంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను ఏప్రిల్ 5 వ తేదీన డెన్మార్క్ ఉన్నత పాఠశాలలో (Denmark High School) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బోర్డు & కార్య నిర్వాహక సభ్యుల జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది.
వ్యాఖ్యాతగా కోమలి & ప్రియాంక ప్రేక్షకులను ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉంచారు.ఉగాది (Ugadi) తెలుగు వారి పర్వదినం. మన తొలి పండగ. దీనిని తమిళులు ‘పుత్తాండు’ గా, మలయాళీలు ‘విషు’ గా, మరాఠీలు ‘గుడి పడ్వా’ గా, సిక్కులు ‘బైసాఖి’ గా, బెంగాలీలు ‘పోయిలా బైశాఖ్’ గా ఉత్సవం జరుపుకొంటారు.
200 మంది పిల్లలతో సాంప్రదాయ, జానపద నృత్యాలు, పాటలు పాడటం మొదలైనవి వేదికపై ప్రదర్శించటం వలన ఈ ఉగాది ఉత్సవాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. ప్రేక్షకులు కూడా ఈ ప్రదర్శనల్లో లీనమై వీక్షించారు.ఉగాది నాటి ఆచారాల్లో పంచాంగ శ్రవణం (Panchanga Sravanam) ప్రత్యేకమైనది. తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే అయిదింటితో కూడుకొన్నది పంచాంగం.
ప్రతినిత్యం మనకు కాలగమనాన్ని భోదిస్తుంది. కాలమాన పరిస్థితిని గుర్తు చేస్తుంది.మన తెలుగు నాట సాంప్రదాయంగా ఉగాది నాడు వినిపించే పంచాంగ శ్రవణం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం (Sri Satyanarayana Swamy Temple) నుండి వచ్చిన పండితులు నాగ రవి గారిచే చెప్పబడింది. ఇందులో కొత్త సంవత్సరంలో సంభవించే ఫలితాలను వివరించారు.
సంవత్సరంలో జరగబోయే శుభాశుభాలు, లాభనష్టాలు, ఆదాయ కందాయ ఫలితాలు, వర్షపాత, పంటల వివరాలు, వ్యక్తుల జాతక ఫలితాలు ఇలా అనేకానేక విషయాలు పంచాంగ శ్రవణం ద్వారా తెలియజేసారు. వచ్చిన వారందరూ శ్రద్దగా తమ విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలాలను ఆలకించారు.
ఈ సంవత్సరం తామా (TAMA) వారు సమాజ సేవలో ఉన్న ముగ్గురు తెలుగు వారిని ఎన్నుకొని వారికి ఉగాది పురస్కారాలను అందజేశారు. ఈ పురస్కార గ్రహీతలు శ్రీ మురళి కృష్ణ గద్దె (అల్లైడ్ ఇన్ఫర్మాటిక్స్ వ్యవస్థాపకులు), శ్రీ గౌతమ్ రెడ్డి గోలి (రాపిడ్ IT వ్యవస్థాపకులు) & శ్రీమతి శాంతి మేడిచెర్ల (కర్ణాటక సంగీత గాయనీమణి).
ఇదే వేదికపై సిలికాన్ ఆంధ్ర ద్వారా తెలుగు భాషకు సేవ చేస్తున్న మనబడి (Silicon Andhra Manabadi) సమన్వయకర్తలను తామా వారు గుర్తించి శాలువా కప్పి, పుష్ప గుచ్ఛంతో గౌరవించడం జరిగింది. కొండపల్లి నుండి కళాకారుల స్వహస్తాలతో తయారు చేసిన, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్న మొమెంటోలను విశిష్ట అతిధులకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా Forsyth County కమీషనర్ టాడ్ లెవంట్, గుడివాడ శాసన సభ్యులు శ్రీ వెనిగండ్ల రాము (Ramu Venigandla) విచ్చేసారు. అలాగే చలన చిత్ర రంగానికి సంబందించిన శ్రీ వెంకట్ దుగ్గి రెడ్డి (Venkat Duggireddy), జో శర్మ (Jo Sharma) కూడా హాజరయ్యారు. వీరిని కూడా తామా వారు వేదికపై సన్మానించారు.
ఇదే రోజున, ఇంతకు ముందుగా పిల్లలకు రోబోటిక్స్ (Robotics) లో పోటీలు, SAT పరీక్షకు ముందస్తు పరీక్షలు నిర్వహించి గెలిచిన పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు చిన్నారుల నుంచి అనూహ్య స్పందన లభించింది.ఈ వేడుకలో వివిధ రకాల వ్యాపారులు దాదాపు 40 కి పైగా స్టాల్ల్స్ (Shopping Stalls) పెట్టారు. వీటిలో చాలా వరకు దుస్తులు, ఆభరణాలు, విద్య, ఆర్ధిక, సంబంధ పరమైనవి ప్రదర్శించారు.
ఈ ఉగాది ఉత్సవానికి స్పాన్సర్స్ గా నిలిచినవారు: పటేల్ బ్రదర్స్, వెంకట్ అడుసుమిల్లి, (వేళా లైఫ్ ప్లాన్), స్వాతి సంగేపు (సన్షైన్ పార్టనర్స్), లక్ష్మణా రెడ్డి జూలకంటి (హన్స్ ఫైనాన్సియల్ గ్రూప్), లక్ష్మి పరిమళ నాటేండ్ల (ట్రూ వ్యూ ఫైనాన్స్), ఖేడ్’స్ ఐస్ క్రీం, రామ కృష్ణ (అనైశ్వర్ ఫైనాన్స్), కోడ్ హీరో అకాడమీ, జుజు పిజ్జా, మలబార్ జెవెలర్స్, అనిల్ గ్రంధి (AG FinTax), మురళి సుంకర (VPR Realty, రియల్ ఎస్టేట్ ఏజెంట్), అప్ టు డేట్ టెక్నాలజీస్ & 3rd Eye.
మలబార్ జెవెలర్స్ వారు Raffle నిర్వహించి అందులో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. జుజు పిజ్జా వారు ఉగాది వేడుకకు వచ్చిన దాదాపు 350 మంది పిల్లలందరికీ ఉచితంగా పిజ్జా ఇవ్వడం జరిగింది.చివరగా తేజస్వి పిడపర్తి (Tejaswi Pidaparthi) & ఆదిత్య ఐయ్యంగార్ (Aditya Iyengar) లతో నిర్వహించిన సంగీత విభావరి ఈ వేడుకకి హాజరైన అతిథులందరినీ ఆహ్లాదపరిచింది.
ఈ ఉగాది (Ugadi) సంబరాలకు నగరం నలు మూలల నుండి 1200 పైగా తెలుగు వారు హాజరయ్యారు. వచ్చిన వారందరికీ పెళ్లి భోజనాల తరహాలో బంతి భోజనాలు (Sahapankti Bhojanalu) పెట్టడం ఈ సంబరం మొత్తానికి చెప్పుకోతగ్గ విషయం. 30 రకాల పదార్ధాలతో అరిటాకులో భోజనం వడ్డించడంతో వచ్చిన వారందరూ చాలా సంతృప్తిగా ఉందని మెచ్చుకోవడమైనది.
భోజన సదుపాయాలు దేశి డిస్ట్రిక్ట్ రెస్టారంట్ (Desi District Restaurant) వారు చేశారు. భోజన సదుపాయాలు సజావుగా సాగడానికి దాదాపు 80 మంది వాలంటీర్స్ పనిచేశారు.చివరగా రుపేంద్ర వేములపల్లి (Rupendra Vemulapalli) ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన వాలంటీర్లు, స్పాన్సర్లు, వచ్చిన ప్రేక్షకులకు సాదరంగా ధన్యవాదాలు తెలిపారు.