ఏ సంస్థ కైనా గొప్ప గొప్ప కార్యక్రమాలు చెయ్యడమే కాదు, ఆ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలగడం చాలా ముఖ్యం. అందునా లాభాపేక్షలేని సంస్థలకి ఇంకా ముఖ్యం. ఎందుకంటే ఇటువంటి సంస్థలు నడిచేదే దాతలు ఇచ్చే నిధుల మీద. దాతలకి ఆయా సంస్థలు చేసే సేవాకార్యక్రమాలు తదితర విషయాలు తెలియాలి కదా మరి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రవాస తెలుగు సంఘం ‘తానా’. తానా చేసే కార్యక్రమాలు కూడా అంతే పెద్దవిగా ఉంటాయి. ప్రస్తుతం అంతా డిజిటల్ మయం. అందులోనూ కోవిడ్ దెబ్బకి గత సంవత్సరంన్నర కాలంగా కార్యక్రమాలు కూడా వర్చ్యువల్ గానే నిర్వహించాల్సిన పరిస్థితులు.
ఈ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ‘తానా’ మీడియా సమన్వయకర్త అవసరాన్ని గుర్తించినట్లుంది. అందుకేనేమో సోషల్ మీడియాలో చెయ్యి తిరిగిన ఠాగూర్ మల్లినేని ని మీడియా కోఆర్డినేటర్ గా నియమించింది. ఠాగూర్ ప్రతిభకి సాక్ష్యం ఎన్నారై తెలుగుదేశం కార్యక్రమాలు మరియు ఈ మధ్యనే ముగిసిన తానా ఎన్నికలు. ప్రత్యేకంగా ఆ ఎన్నికల్లో ఓడిన వర్గానికి గుమ్మనంగా పగలుపూటే చుక్కలు చూపించిన వైనం గురించి కథలు కథలుగా చెప్తారు గెలిచిన వర్గం. ఆడేంటిరా ఎంత రెచ్చగొట్టినా సమన్వయం కోల్పోకుండా తనపని తను చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉన్నాడు అని ఒక పెద్దమనిషి వ్యాఖ్యానించడం ఠాగూర్ నైజానికి నిదర్శనం. ఏ కార్యక్రమాన్నైనా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో స్థిరంగా ట్రెండ్ చెయ్యగల సమర్ధుడు.
సౌమ్యునిగా పేరున్న ఠాగూర్ మల్లినేని చార్లెట్ అపలాచియాన్ ప్రాంతంలో తానా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. తానా క్యూరీ పోటీలకు నేషనల్ ఛైర్మన్ గా, తానా రైతుకోసం పబ్లిసిటీ కమిటీ మెంబర్ గా, తానా ఫౌండేషన్ 5కె వాక్/రన్ తదితర కార్యక్రమాలలో తనదైన శైలిలో ఎనర్జిటిక్ గా పనిచేసారు. అంతేకాకుండాపెనమలూరు ఎన్నారై అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యునిగా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కి సోలార్ సిస్టం, పెనమలూరు పశువైద్యశాల ఆధునీకరణ, పేద విద్యార్ధులకి పుస్తకాలు, బ్యాగ్స్ అందించడం, పేదలకు అన్నదానం వంటి మంచి కార్యక్రమాల నిర్వహణలో ముందున్నారు.