దివంగత గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం 75వ జయంతి కార్యక్రమం జూన్ 3 శుక్రవారం నాడు అమెరికాలో న్యూ జెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఘనంగా నిర్వహించారు.
కళావేదిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల, ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, న్యూ జెర్సీ అసెంబ్లీ సభ్యుడు స్టెర్లి స్టాన్లీ, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల ముఖ్య అథిధులుగా హాజరయ్యారు.
విజయవాడ కనకదుర్గ దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మర్షి శాండిల్య శర్మ వేద ఆశీర్వచనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్పీబీ చిత్రపటానికి పుష్పాలతో నివాళి అర్పించారు. ప్రముఖ గాయనీమణులు ఉష, రీటా, మౌనిమ, అదితి భావరాజు, మౌనిక, శ్రీకాంత్ సండుగు, కార్యక్రమ వ్యాఖ్యాత సాహితి తదితరులు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారితో తమ అనుబంధాన్ని, ఆయన గొప్పతనాన్ని సభికులతో పంచుకున్నారు.
ఉత్తర అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 700 మందికి పైగా ఎస్పీబీ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికీ, సహకరించిన వారికీ కళావేదిక అధ్యక్షులు స్వాతి అట్లూరి, కార్యదర్శి సింగర్ ఉష, కోఆర్డినేటర్ ఉజ్వల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ధన్యవాదాలు తెలిపారు.