యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) కోశాధికారిగా కృష్ణా జిల్లాకు చెందిన రాజా కసుకుర్తి ఎన్నికయ్యారు. 2023-25 కాలానికి గాను ఏర్పాటు చేసిన తానా ఎగ్జిక్యూటివ్ కమిటీలో రాజా ని కోశాధికారి (Treasurer) పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రాజా కసుకుర్తి మాట్లాడుతూ.. వంద మందికి సహాయపడలేకపోయినా ఒక్కరికి సహాయం చేయమన్న మదర్ థెరిస్సా స్ఫూర్తిగా వంద కాదు కదా కొన్ని వేల మందికి సహాయపడే అవకాశాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ‘తానా’ తనకు ఇచ్చింది అన్నారు. ఇదే స్ఫూర్తితో తానా సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు.
తానా కోశాధికారిగా నిధుల వ్యవహారాల్లో మరింత బాధ్యతగా, పారదర్శకంగా వ్యవహరిస్తానని, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలను ఎప్పటిలానే నిరంతరం చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా రాజా కసుకుర్తి అన్నారు. గతంలో కూడా రాజా తానాలో పలు పదవులు నిర్వహించి వన్నె తెచ్చారు.
తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్, న్యూ జెర్సీ ప్రాంతీయ ప్రతినిధి, బ్యాక్‌ప్యాక్ కో చైర్ వంటి పదవులను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామా వాసి అయిన రాజా (Raja Kasukurthi) ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు.
రాజా తెలుగు రాష్ట్రాల్లో తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అమెరికాలో కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్‌గా తెలుగు విద్యార్థులకు ఉపయోగపడేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఉచిత కంటి చికిత్స, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, వృద్ధులకు రగ్గులు, రైతులకు అవసరమైన పరికరాలను అందించారు.
కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, వీరవల్లి గ్రామస్థులు రాజా కసుకుర్తి (Raja Kasukurthi) కి పదవి లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలోని పలువురు మిత్రులు, తానా (TANA) నాయకులు, సభ్యులు న్యూ జెర్సీ (New Jersey) లో ఉంటున్న రాజా కసుకుర్తి కి అభినందనలు తెలిపారు.