తానా ఫౌండేషన్ ట్రస్టీగా పోటీ చేస్తున్న గుదె పురుషోత్తమ చౌదరి తానా ఫౌండేషన్ ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు, తెలంగాణ మరియు కృష్ణ డెల్టా ప్రాంతాలలో తానా సేవా కార్యక్రమాల విస్తరణకు కృషి చేస్తానని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తానా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నానని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలానికి చెందిన పురుషోత్తమ చౌదరి నెల్లూరు జిల్లా విద్యానగర్ కోటలోని NBKRIST నుండి ఇంజినీరింగ్ పట్టా అందుకుని కొంతకాలం బెంగుళూరులో ఐటీ ఉద్యోగిగా పనిచేశారు. అనంతరం 1997 డిసెంబరులో ఉద్యోగరీత్యా అమెరికా వచ్చిన ఆయన 2003 నుండి తానాలో జీవితకాల సభ్యుడిగా ఉన్నారు. 2015లో తానా ప్రత్యేక ప్రాజెక్టుల కమిటీ అధ్యక్షుడిగా సంస్థ సేవా కార్యక్రమాల్లోకి ప్రవేశించిన ఆయన తానా ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
షార్లెట్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకుని స్థానిక తెలుగు సంఘం TAGCA కార్యదర్శి, అధ్యక్షుడిగా వ్యవహరించారు. స్థానిక త్రిమూర్తి ఆలయ నిర్మాణానికి నిధుల సేకరణ కమిటీ అధ్యక్షుడిగా $7.5లక్షల డాలర్లను సమీకరించారు. సొంత గ్రామంలో పేదల కళ్యాణాలకు ₹40లక్షల విలువైన కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఆయన అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.