గత గురువారం ఆంధ్రప్రదేశ్ లోని సిద్ధాంతం గ్రామంలో బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిని రమ్య పాశవిక హత్యకి గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యని ఖండిస్తూ నిందితుడికి తగిన శిక్ష అమలు చేయాలనే డిమాండ్తో కొవ్వొత్తులతో ర్యాలీ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా నాయకులు కప్పల రత్న రాజు మాట్లాడుతూ ఒకరు కాదు ఇద్దరు కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని తరగతుల మహిళలు ఏదో అఘాయిత్యాని కి గురవుతూనే ఉన్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే రమ్య హత్యకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దళిత మహిళలపై హత్యలు, అఘాయిత్యాలు జరగడం ఆందోళనకరమైన విషయమన్నారు.
దేశంలో వర్గ దృక్పధం లేని ఆర్ ఎస్ ఎస్ పాలన సాగుతోందని విమర్శించారు. సమాజంలో ప్రాబల్య వర్గాల తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఈ విధానాలు మారాలని డిమాండ్ చేశారు. దళిత విద్యార్థిని రమ్య కు న్యాయం జరిగే వరకు పోరాటాలు నిర్వహిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సహాయం అందించాలని, అలాగే రమ్య కుటుంబానికి సహాయ సహకారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘాలు, కెవిపిఎస్ నాయకులు రొక్కల ధనరాజు, ముత్తా బత్తుల ప్రసాద్, బూల నరసింహ రాజు చిక్కాల చిన్న, చిన్నం శివ గుమ్మడి రాజు, నూక పెయ్యి సూర్యారావు నూక పెయ్యి రమణ మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.