ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల పరిశ్రమలకి సంబంధించి మరీ ముఖ్యంగా అమర రాజా సంస్థ తరలింపుపై వస్తున్న వార్తల దృష్ట్యా అమెరికాలోని అట్లాంటా ఎన్నారైలు నిరసన తెలియజేసారు. స్థానిక చాటహూచి పార్కులో గత ఆదివారం ఆగష్టు 8న సమావేశమయ్యారు. ముఖ్యంగా అమర రాజా సంస్థలో పనిచేసిన వారు, చిత్తూరు ఎన్నారైలు మరియు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు తమ సూచనలను, అనుభవాలను తెలియజేశారు.
ఈ సమావేశంలో మొదటగా చిత్తూరు ఎన్నారై విజయ్ మాట్లాడుతూ అమర రాజా లాంటి పెద్ద సంస్థను చిత్తూరు జిల్లా నుండి వెళ్ళమనటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం మరియు సంస్థ యాజమాన్యం చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని తద్వారా సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను అలాగే పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న లక్షలాది కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంతకుముందు అమర రాజా సంస్థలో పనిచేసి అమెరికాలో స్థిరపడిన మధు, ప్రసూన మరియు కిషోర్ మాట్లాడుతూ పర్యావరణం దృష్ట్యా అమర రాజా సంస్థ అమలు చేస్తున్న ఉన్నత అంతర్జాతీయ ప్రమాణాల గురించి అలాగే బ్యాటరీ రంగంలో రాబోతున్న కొత్త అవకాశాలు, అభివృద్ధి తద్వారా రాష్ట్రానికి, దేశానికి జరగబోయే మేలు గురించి మాట్లాడుతూ సంస్థ తరలింపు సరైనది కాదని తెలిపారు.
తదనంతరం మల్లిక్, గిరి, సురేష్, రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఎంతో ముఖ్యమని తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు పెరగాలని, ఉన్న పరిశ్రమలను కాపాడుకోవాలని, ముఖ్యంగా అంతర్జాతీయస్థాయిలో పేరు గాంచిన అమర రాజా సంస్థ తరలింపు రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదని సూచించారు. ఇలా జరిగితే రేపు ఇతర కంపెనీలు రాష్ట్రానికి రావడం ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వ ఆర్థికాభివృద్ధి విధానాలు పరిశ్రమలకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండాలని తద్వారా రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. చివరగా విజయ్ మాట్లాడుతూ ఈ సమావేశ నిర్వహణలో సహాయపడిన శివ, వెంకీ, మురళి తదితరులకు, తేనీటి విందు అందించిన శ్రీ కృష్ణ విలాస్ సతీష్ కి, అలాగే పాల్గొన్న ఎన్నారైలకు ధన్యవాదాలు తెలిపారు.