Connect with us

News

తత్వా ఆధ్వర్యంలో PVSA పురస్కారాలు @ Los Angeles, California

Published

on

గత శనివారం లాస్ ఏంజెల్స్ (Los Angeles) లో జరిగిన కార్యక్రమంలో, సమాజానికి ఎంతో ఉన్నతమైనటువంటి సేవలందించిన 78 మంది యువ స్వచ్చంధ సేవకులకును, సంఘ సేవలలో ఉన్నతంగా భావించే ప్రెసిడెంట్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్స్ (President’s Volunteer Service Awards – PVSA)తో, తత్వా ఘనంగా సత్కరించింది

ఈ ప్రెసిడెంట్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్స్ ని 2003 లో అమెరికా దేశ జాతీయత, సమగ్రత పెంపొందించేలా దేశం నలుమూలల లాభాపేక్ష లేకుండా స్వచ్ఛంద సేవ చేస్తున్న స్వచ్ఛంద సేవకులను గుర్తించి, వారిని ఉత్తేజపరిచేలా, వారు మరి కొంతమంది కి దిశా నిర్దేశం చేసే విధంగా ఉండాలని ప్రారంభించినట్లు అవార్డ్స్ ని ఇస్తున్నటువంటి అమెరికా జాతీయ సంస్థ అయిన అమెరికార్ప్స్ (AmeriCorps) తెలిపింది. ఈ అవార్డ్స్ ను నేరుగా స్వచ్ఛంద సేవకులకు అందజేయకుండా గుర్తింపు పొందిన స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా అర్హులైన స్వచ్ఛంద సేవకులకు ప్రతి సంవత్సరం అందజేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

దక్షిణ కాలిఫోర్నియాలో, సదరు గుర్తింపు పొందిన అతి కొన్ని(కొద్ది) స్వచ్ఛంద సంస్థలలో ట్రైవ్యాలీ తెలుగు సంఘం (Telugu Association of Trivalley) ఒకటి అని, సంస్థ నిర్వాహకులలో ఒకరైన రాం కొడితాల (Ram Koditala) తెలిపారు. సదరు గుర్తింపు కోసం ప్రతి సంవత్సరం అమెరికార్ప్స్ జాతీయ సంస్థ నిర్వహించే జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని, అలాగే తమ స్వచ్ఛంద సంస్థ యొక్క అకౌంటింగ్, సేవా కార్యక్రమాలు నిష్పక్షపాతంగా ఉండాలని, సమాజానికి ఉపయోగపడేలా సంఘ కార్యక్రమాలు ఉండాలని, అవన్నీ అర్హతలు ఉన్నందువల్ల తత్వా గత మూడు సంవత్సరాలుగా ఈ PVSA అవార్డ్స్ ను లాస్ ఆంజెల్స్ లో ఉన్న అర్హులైన స్వచ్ఛంద సేవకులకు అంద జేయ గలుగుతుందని సగర్వంగా తెలిపారు.

2021లో 24 మంది గ్రహీతలు ఉన్నారని, 2022లో 52 మంది గ్రహీతలు ఉన్నారని, 2023లో 80 కి పైగా వచ్చిన దరఖాస్తులలో 78 మంది అర్హత సాధించారని, వారందరూ కలిసి 12,341 గంటల సమాజసేవ చేశారని తెలిపారు. ప్రస్తుతానికి 11 నుండి 25 ఏళ్ల లోపు ఉన్న మాధ్యమిక, ఉన్నత మరియు కళాశాలలో చదువుతూ స్వచ్ఛంద సేవ చేస్తున్న విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

తద్వారా వారు ఆ విద్యార్థిని విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి స్వచ్ఛంద సేవ చేయాలని కోరుకుంటారని, తామే కాకుండా తమ తోటి వారిని కూడా ఇందులో భాగస్వాములు అయ్యేలాగా ప్రోత్సహిస్తారని మరియు వారి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ ఈ స్వచ్ఛంద సేవను కొనసాగిస్తారని, ఎందుకంటే వారికి ఊహ తెలుస్తున్న సమయంలోనేర్చుకున్న మంచి పనులే వారికి జీవిత కాలంలో సదా తోడుగా ఉంటాయని అందుకే ఈ విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

ఈ అవార్డ్స్ లో భాగంగా అర్హత సంపాదించిన ప్రతి స్వచ్ఛంద సేవకులకు వారి వారి వయసు ప్రకారం, వారు వెచ్చించిన సమయానికి అనుగుణంగా గోల్డ్, సిల్వర్ లేదా బ్రాంజ్ లతో ప్రత్యేకంగా తయారు చేయించబడిన పతకం, దానితోపాటు ప్రస్తుత అమెరికా దేశ అధ్యక్షులు సంతకం చేసిన ప్రత్యేక ప్రశంసా పత్రం వైట్ హౌస్ ఆఫీస్ నుండి వస్తుందని, వారు వెచ్చించిన సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ప్రత్యేకమైన ధృవ పత్రం (Certificate) వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ అవార్డ్స్ కు సంబంధించి రుసుమును దరఖాస్తు దారుల నుండి కానీ, అవార్డు గ్రహీతల నుండి కానీ, వారి తల్లిదండ్రుల నుండి కానీ వసూలు చేయడం జరగదని అందుకు నియమ నిబంధనలు అంగీకరించవని, దీనికి సంబంధించిన ప్రతి డాలర్ కూడా ఆయా స్వచ్ఛంద సంస్థలు సేకరించిన విరాళాల నుండి ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా మిగతా తత్వవేత్తలని (The team of TATVA) చందు నంగినేని, డాంజీ తోటపల్లి, హరి ర్యాలీ, జగన్ జటావల్లభుల, కిషోర్ రామధేను, కుమార్ తాలింకి, లక్ష్మీ బొల్లపల్లి, నీలిమ టంగుటూరు, శైలజ మద్దాలి, వెంకట్ చెరుకుపల్లి, వెంకట ఓరుగంటి, విజయ్ భీమిశెట్టి, విజయ్ కాసనగొట్టు లను సభకి పరిచయం చేశారు. అదేవిధంగా ఈసారి పీవీఎస్ఏ దరఖాస్తుల ప్రక్రియలో ఎంతో సహాయ సహకారాలు అందించి, పిల్లలు పొందుపరిచిన సామాజిక కార్యక్రమాల వివరాలను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన విద్యార్థినీ విద్యార్థుల సమాచారాన్ని తత్వా వారికి అందజేసి ఎంతో సహాయం చేసిన జితేష్ మద్దాలి ని కూడా సభకి పరిచయం చేశారు.

ఈ సందర్భంగా తత్వా వారు అవార్డు గ్రహీతలను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి స్వచ్ఛంద సేవ కార్యక్రమాల ద్వారా ఈ స్వచ్ఛంద సేవకులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందచేయగలుగుతున్నారని, వారికున్నటువంటి సాంకేతిక, విద్యాపరమైన జ్ఞానంతో సమాజానికి తమ వంతు కృషి చేయగలుగుతున్నారని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమం నిర్వహించడం ఆర్థికంగా, నిర్వహణపరంగా కష్టతరమైనప్పటికిని ఇలాంటి స్వచ్ఛంద సేవల ద్వారా సమాజానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని తత్వా వారు తెలిపారు. ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే వారందరికీ తత్వా ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈసారి అవార్డు గ్రహీతలలో చాలామంది జూనియర్ సీనియర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వారి వారి తీరిక లేని కార్యక్రమాలకి భయపడకుండా సంఘ సేవ చేయడం తద్వారా PVSA పొందడం ఎంతో అభినందనీయమని తెలిపారు

ఈ అవార్డ్స్ ను స్వీకరించడానికి వచ్చిన 78 మంది విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులతో దాదాపు 500 మందికి పైగా ఆహ్వానితులతో హాలంతా నిండిపోయి కళకళలాడిపోయింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు తమ తమ సేవా కార్యక్రమాలను వీడియో రూపంలో అందరితో పంచుకున్నారు.

వీరు ఈ సేవా కార్యక్రమాల ద్వారా తమలో నాయకత్వ లక్షణాలు పెంపొందాయని, కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చెందాయని, తమ తోటి వారికి, సమాజానికి సహాయం చేయడం వల్ల వారు పొందిన ఆనందాలు వీరిని మంత్రముగ్ధులు చేశాయని తద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, అందుకుఅనుగుణంగా తమ విద్యా సంబంధమైన, క్రీడా కార్యక్రమాల ప్రణాళికలను మార్చుకోవాలని, తమకు వీలైనంత సంఘ సేవ చేయాలని తామే కాకుండా తమ తోటి వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు

ఈసారి అవార్డు గ్రహీతలు ఆసుపత్రులలో రోగులకు సేవ చేయడం ద్వారా, పుస్తకాలు దొరికే అవకాశం లేని ఆఫ్రికాలోని పలు దేశాలకు అవసరమైనటువంటి మాధ్యమిక, ఉన్నత పాఠశాల పుస్తకాలు మరియు వారి వారి అభివృద్ధికి సంబంధించిన పుస్తకాలు సేకరించి దాదాపు ఐదు లక్షలకు పైగా పుస్తకాలు పంపించడం ద్వారా, అవసరమైన విద్యార్థినీ విద్యార్థులకు విద్యాపరమైనటువంటి సందేహాలు తీర్చడం ద్వారా, స్థానిక గ్రంథాలయాలలో రోబోటిక్స్ శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా, వివిధ నగరాల్లో ఉన్న ఆహార కేంద్రాలకి అవసరమైనటువంటి ఆహార పదార్థాల సేకరణ ద్వారా, భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నాయకత్వ లక్షణాలలో, కమ్యూనికేషన్ స్కిల్స్ లో zoom ద్వారా ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం ద్వారా, సంగీతం నేర్పించడం ద్వారా, సంఘ సేవ చేసామని అన్నారు.

తద్వారా ఎంతో మానసిక ఆనందాన్ని పొందామని తమ చేసిన పనుల వల్ల ఒక్కరికైనా సహాయం అందడం వల్ల తమ ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు. తాము చేసిన సంఘసేవ కార్యక్రమాలకి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సంస్థ నుండి ప్రత్యేక పతకాలు, ధృవీకరణ పత్రాలతో పాటుగా అమెరికా అధ్యక్షులవారు సంతకం చేసిన ప్రశంసా పత్రాలతో తమను ప్రోత్సహించినందుకు తత్వా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కఠిన తరమైన జాతీయస్థాయి పరీక్షలలో ఉత్తీర్ణత సంపాదిస్తూ, ఖర్చులకు వెనుకాడకుండా, కావలసిన ఖర్చులను విరాళాల ద్వారా సేకరిస్తూ అర్హులైన పిల్లలకి PVSA అవార్డులను అందజేసి వారిలో నూతనొత్తేజము పెంపొందిస్తూ మరింత సమాజసేవ చేయాలనే తలంపును పెంపొందిస్తూ ఈ కార్యక్రమాలను గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తత్వా వారిని తల్లిదండ్రులందరూ, విచ్చేసిన ఆహుతులు ప్రత్యేకంగా అభినందించారు.

కొద్దిమంది తల్లిదండ్రులు ఈ PVSA గ్రహీతల సమాచారాన్ని ప్రతిష్టాత్మకమైన కళాశాల దరఖాస్తులలో కూడా పొందుపరుస్తున్నామని తెలిపారు మరి కొంతమంది తల్లిదండ్రులు కళాశాలలలో చదువుతున్న తమ పిల్లలకు సంఘ సేవ చేసే కొన్ని సంస్థల ద్వారా ఉపకార వేతనాలు కూడా అందాయని ఆనందంగా తెలిపారు

ఈ కార్యక్రమం నిర్వహించడంలో తమ తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన వివిధ వాలంటీర్స్ కు, దాతలకు తత్వా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పిల్లలు ఈ సామాజిక సేవలో మరింత ముందుకు పోవాలని అందుకు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి, వారికి కావల్సిన సహాయ సహకారాన్ని అందించాలని , అందరి సహాయ సహకారాలతో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తత్వా వారు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected