కోవిడ్ మహమ్మారి దెబ్బకు సుమారు సంవత్సరంన్నర నుంచి ఎక్కువమంది ఇంటి దగ్గిరనుంచి పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగుల్లో ఆ శాతం బాగా ఎక్కువ. అమెరికాలోచాలా సంస్థలు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వడంతో కొంతమంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలనుంచి జీవన వ్యయం తక్కువగా ఉండే ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. ఇందులో భాగంగానే కొన్ని నగరాల్లో ఇళ్ల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి.
ఇప్పుడే వచ్చిపడింది చిక్కు. తమ ఆఫీస్ ఉన్న ప్రాంతంలో కాకుండా సబర్బన్ ప్రాంతాలకు వెళ్లి ఇంటి దగ్గిర నుంచి పనిచేసే ఐటీ ఉద్యోగుల జీతాల్లో కటింగ్ చెయ్యాలని కొన్ని సంస్థలు ఆలోచనలు మొదలుపెట్టాయి. అటువంటివారికి సుమారు ఐదు శాతం నుంచి ఇరవైఐదు శాతం వరకు జీతాల్లో కోత విధించాలనేది ప్రతిపాదన. ఈ జాబితాలో ప్రస్తుతానికి ఫేస్బుక్, లింక్డ్ ఇన్, ట్విట్టర్, గూగుల్ తదితర సంస్థలు ఉన్నాయి. కాకపోతే ఇంకో పక్క ఇలా చెయ్యడం సరైన పద్ధతి కాదని ఐటీ కాంపౌండ్స్ లో చర్చలు నడుస్తున్నాయి. అంతే కాకుండా జాబ్ వీసా మీద పనిచేసే వారికి మెట్రో స్టాటిస్టికల్ ఏరియా కేటగిరీలో వీసా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు. చూద్దాం కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ముందు ముందు ఇంకెన్ని వైపరీత్యాలు ఎదురవుతాయో.